Share News

ఎల్లంపల్లి మళ్లీ హిట్‌

ABN , Publish Date - Jul 31 , 2026 | 07:43 AM

గోదావరి నీటిని మేడిగడ్డ వద్ద నుంచి రివర్స్‌లో ఎత్తిపోస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుందన్న వాదనకు ప్రకృతే సమాధానం చెప్పిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి ఒక్క చుక్క నీటిని ఎత్తిపోయకుండానే ఎగువన కురిసిన వర్షాలు, కడెం ప్రాజెక్టు నుంచి వచ్చిన భారీ వరదతో ఎల్లంపల్లి నిండిపోవడాన్ని ప్రస్తావిస్తున్నాయి.

ఎల్లంపల్లి మళ్లీ హిట్‌

  • రివర్స్‌ పంపింగ్‌ వాదన మళ్లీ ఫెయిల్‌

  • నీళ్లు ఎత్తిపోయకుండానే నిండిన శ్రీపాద ఎల్లంపల్లి

  • కడెం, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి 3.9 లక్షల క్యూసెక్కుల వరద

  • ప్రభుత్వంలో సంబురం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గోదావరి నీటిని మేడిగడ్డ వద్ద నుంచి రివర్స్‌లో ఎత్తిపోస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుందన్న వాదనకు ప్రకృతే సమాధానం చెప్పిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి ఒక్క చుక్క నీటిని ఎత్తిపోయకుండానే ఎగువన కురిసిన వర్షాలు, కడెం ప్రాజెక్టు నుంచి వచ్చిన భారీ వరదతో ఎల్లంపల్లి నిండిపోవడాన్ని ప్రస్తావిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో గురువారం రాత్రి 30 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపాయి. గోదావరి బేసిన్‌లోని కీలక ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లికి భారీ వరదతో ప్రభుత్వంలో సంబురం మొదలైంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవవని, క్లిష్ట పరిస్థితులు ఉంటాయనే సంకేతాలతో కలవరానికి గురైన ప్రభుత్వం.. తాజా వరదతో ఊపిరి పీల్చుకుంది.


గురువారం రాత్రి 9 గంటలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఏకంగా 3,90,300 క్యూసెక్కుల వరద రికార్డయింది. ఇందులో కడెం ప్రాజెక్టు నుంచి 1,56,279 క్యూసెక్కులు, స్థానిక పరీవాహక ప్రాంతం నుంచి 2,60,079 క్యూసెక్కులు వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఒక్క క్యూసెక్కు ప్రవాహం కూడా లేకపోయినా ఎల్లంపల్లికి ఈ స్థాయిలో వరద చేరడం గమనార్హమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా గురువారం రాత్రి 147.7 మీటర్లకు చేరింది. మొత్తం 20.175 టీఎంసీల సామర్థ్యానికి 19.703 టీఎంసీల నిల్వ ఉంది. అంటే ప్రాజెక్టు 97శాతం నిండింది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో 62 గేట్లలో 30 గేట్లను ఎత్తి 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

నీళ్లు ఎత్తిపోయకుండానే నిండిన ఎల్లంపల్లి

వేలాది కోట్లు ఖర్చు పెట్టి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి, కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి గోదావరి నీటిని నదికి ఎదురుగా రివర్స్‌లో ఎత్తిపోసే వ్యవస్థను రూపొందించారు. మేడిగడ్డ నుంచి అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్లకు, అక్కడ నుంచి ఎల్లంపల్లికి మూడు దశల్లో నీటిని లిఫ్ట్‌ చేసేందుకు పంప్‌ హౌస్‌లు, బ్యారేజీలు నిర్మించారు. మేడిగడ్డ నుంచి సుమారు 47.2 కిలోమీటర్ల దూరంలో అన్నారం, 80.7 కి.మీ. దూరంలో సుందిళ్ల, 111.1 కి.మీ. దూరంలో ఎల్లంపల్లి ఉన్నాయి. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ ద్వారా అన్నారానికి, అక్కడి నుంచి సుందిళ్లకు, చివరకు ఎల్లంపల్లికి ఎత్తిపోస్తేనే ఉత్తర తెలంగాణకు నీరు అందుతుందని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని ప్రభుత్వం తెలిపింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సీపేజీలు బయటపడటంతో మూడు బ్యారేజీల వద్ద గేట్లను ఫ్రీ ఫ్లో కండిషన్‌లో ప్రభుత్వం తెరిచిపెట్టింది. నీటిని నిల్వ చేస్తే ప్రమాదమన్న ఎన్‌డీఎ్‌సఏ సూచనలను అమలు చేసింది. కన్నెపల్లి నుంచి నీటిని పంపింగ్‌ చేయాలని విపక్షాలు ఇటీవల పట్టుపట్టాయి. ప్రాణహితలో నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి పంపులను ఎందుకు నడపడం లేదని ప్రశ్నించాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేసి ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని డిమాండ్‌ చేశాయి. అయితే నదిలో నీరు కనిపించడం వేరు.. పంపులు నడపడానికి అవసరమైన కనీస నీటిమట్టం ఉండటం వేరు. మేడిగడ్డలో పంపింగ్‌కు కనీసం+93.50మీటర్లు, అన్నారంలో+116.50మీటర్లు, సుందిళ్లలో +126.50 మీటర్ల నీటిమట్టం అవసరం. అంతేకాకుండా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో నీటిని నిల్వ చేయడం సాధ్యంకాదని ప్రభుత్వం గుర్తుచేసింది.


ఇవీ చదవండి:

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

తలసేమియా బాధితులకు పింఛన్లు

Updated Date - Jul 31 , 2026 | 07:43 AM