Share News

లోపాలమయం సర్‌

ABN , Publish Date - Aug 30 , 2026 | 05:05 AM

తెలంగాణలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)-2026’ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ఓటరు జాబితాలో చేరకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌కు లేఖ రాశారు.

లోపాలమయం సర్‌
sir

  • సిబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో లేని వారి

  • పేర్లను జాబితా నుంచి తొలగించారు

  • ఇల్లు మారిన వారికి నోటీసివ్వకుండా వేటు

  • 3.38 కోట్ల మంది ఓటర్లలో

  • 73.39 లక్షల మంది తొలగింపు

  • మరో 92.86 లక్షల మందికి నోటీసులు

  • హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డిలో ఎక్కువ

  • సమగ్ర జాబితా కోసం సమయం తీసుకోండి

  • గడువును మరో 4 వారాలు పొడిగించండి

  • ఓటర్ల జాబితా సవరణపై ప్రధాన

  • ఎన్నికల కమిషనర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)-2026’ ప్రక్రియలో పలు లోపాలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు ఎవరూ ఓటరు జాబితాలో చేరకూడదని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌కు లేఖ రాశారు. సర్‌ ముసాయిదా జాబితా విడుదలైన నేపథ్యంలో అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించే గడువును పొడిగించడంతో పాటు ఓటర్లకు తగినంత సమయం, అవసరమైన సహాయం అందించేలా విధానపరమైన భద్రత చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. 2026 జూన్‌ 10నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 73.39 లక్షల మందిని (21.7శాతం) గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా గుర్తించినట్లు ఈసీ గణాంకాలను ప్రస్తావించారు. ఈ వర్గంలో దాదాపు 62శాతం మంది అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. మరోవైపు డిజిటలైజ్‌ చేసిన 2.65 కోట్ల మంది తాలూకు పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉండగా, 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం లేదని తేలిందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. ఫలితంగా 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్రంలో దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని తెలిపారు.


అందరినీ ఒకే గాటన..

ఓటరు జాబితా సవరణ విధానంలో కొన్ని తీవ్రమైన లోపాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. గణన సిబ్బంది పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకే విధంగా పరిగణిస్తున్నారని తెలిపారు. నివాసం మారిన వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫాం-6 ద్వారా సహాయం అందించకుండానే పాత నివాసంలోని ఓటు తొలగిస్తున్నారన్నారు. నివాసం మారిన వారి పేర్లను తొలగించే ముందు అనుసరించాల్సిన నోటీసు ప్రక్రియను పాటించలేదని తెలిపారు. దీనివల్ల ఓటర్లు పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రానికి వెళ్లే వరకు తమ ఓటు హక్కును కోల్పోయిన విషయం తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం గైర్హాజరు, నివాసం మారిన, మరణించిన, ఒకటికి మించి నమోదైన ఓటర్లలో 58.6శాతం, నోటీసులు అందుకునే ఓటర్లలో 41.9శాతం హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారని సీఎం రేవంత్‌గుర్తు చేశారు. ఉద్యోగాలు, వివాహాలు, తాత్కాలిక నివాస మార్పుల కారణంగా పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున సవరణ ప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.


గడువు పెంచి సమగ్రంగా నిర్వహించండి

సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవని, అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని సీఎం గుర్తు చేశారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో 4 వారాలు పొడిగించాలని, తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని ఇప్పుడున్న అక్టోబరు19 నుంచి మరికొన్ని వారాలపాటు పొడిగించాలని కోరారు. గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల్లో ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించి, కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను బహిరంగంగా ప్రజలకు చదివి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు తమకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు వారం రోజుల సమయం సరిపోదని, కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గం, పోలింగ్‌ కేంద్రం స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటర్లకు అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడంతో పాటు, అవి లభించేలా వారికి సహకరించాలన్నారు.


పత్రాల జాబితాను విస్తరించాలి

ప్రభుత్వ ఉత్తర్వు (జీవో నంబర్‌ 172) ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సీఎం రేవంత్‌ తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర పత్రాలను కూడా అంగీకరించేలా పత్రాల జాబితాను సవరించి, విస్తరించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో నోటీసులు అందుకున్న ఓటర్లు సగటున 78 వేలకుపైగా ఉన్నందున పరిమిత సంఖ్యలో అధికారుల నియామకం సరిపోదని, అదనపు అధికారులను నియమించాలని, విచారణ కేంద్రాలను మరింత పెంచటమేగాక వికేంద్రీకరించాలని సూచించారు. సర్‌ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభల నిర్వహణతోపాటు పరిపాలనాపరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


రేవంత్‌ లేఖపై స్పందించండి: జైరాం రమేశ్‌

ఎస్‌ఐఆర్‌పై సీఎం రేవంత్‌ రాసిన లేఖపై స్పందించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌ వేదికగా రేవంత్‌ రాసిన లేఖను షేర్‌ చేస్తూ ఓ పోస్టు పెట్టారు.


ఇవీ చదవండి:

విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా

చేతిలో డబ్బులున్నాయా.. ఒకేసారి పెట్టుబడి మేలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 05:18 AM