చేతిలో డబ్బులున్నాయా.. ఒకేసారి పెట్టుబడి మేలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:33 AM
కొంతమంది చేతికి ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు చేరతాయి. బోనస్ లేదా ఇల్లు లేదా పొలాల విక్రయం లేదా ఇతర రూపాల్లో ఈ నిధులు రావచ్చు. ఇలా ఒకేసారి చేతికి వచ్చిన నిధులను..
కొంతమంది చేతికి ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు చేరతాయి. బోనస్ లేదా ఇల్లు లేదా పొలాల విక్రయం లేదా ఇతర రూపాల్లో ఈ నిధులు రావచ్చు. ఇలా ఒకేసారి చేతికి వచ్చిన నిధులను.. ఇతర అవసరాలు ఏమీ లేకపోతే హామీతో కూడిన అధిక రాబడులు ఇచ్చే పెట్టుబడుల్లో మదుపు చేయడం మంచిది. అలా చేయడం వల్ల నెలనెలా క్రమానుగత పెట్టుబడుల (సిప్) తిప్పలు ఉండవు. బుల్ మార్కెట్లో ఈ తరహా పెట్టుబడులు సిప్ కంటే అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇది అందరికీ సూట్ కాదు. ఒక మాదిరి నుంచి అధిక రిస్క్ తట్టుకునే సత్తా ఉన్న మదుపరులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఎవరికి అనుకూలం?
రిటైర్మెంట్ ఫండ్స్, పిల్లల విద్య, దీర్ఘకాలిక ఆస్తుల కల్పన కోసం చూసేవారు, ఒకేసారి ఇలా భారీ పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు.
పెట్టుబడి మార్గాలు
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్
కొద్దిగా రిస్క్ ఉన్నా పర్వాలేదనుకుంటే అధిక రాబడుల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి
పెద్దగా రిస్క్ భరించలేమనుకుంటే డెట్, లిక్విడ్ ఫండ్స్ ఎంచుకోవచ్చు
నష్టభయం ఉన్నా పర్వాలేదనుకుంటే నేరుగా మంచి కంపెనీల షేర్లలో మదుపు చేయాలి
హామీతో కూడిన రాబడులు కావాలనుకుంటే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లను ఎంచుకోవాలి.
రక్షణ, పెట్టుబడి లాభాలు కావాలనుకుంటే యూనిట్ లింక్డ్ ప్లాన్స్ (యూలిప్స్)ను ఎంపిక చేసుకోవాలి
ఈక్విటీ ఫండ్స్ ప్రయోజనాలు
నేరుగా షేర్లలో పెట్టుబడులతో పోలిస్తే రిస్క్ తక్కువ
నిపుణులైన ఫండ్ మేనేజర్ల నిర్వహణ, పెట్టుబడుల వివిధీకరణతో నష్టభయం తగ్గుతుంది
ఈఎల్‌ఎస్ఎస్ పథకాల్లో మదుపు చేస్తే సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి
దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు అత్యంత అనుకూలం.
భద్రత కావాలంటే?
డెట్ ఫండ్స్
ప్రభుత్వ, ట్రిపుల్ ‘ఏ’ రేటింగ్ ఉన్న కంపెనీల రుణపత్రాలు
జూతక్కువ రిస్క్‌తో స్థిరమైన ఆదాయం, పెద్దగా పన్నుల భారం వద్దనుకుంటే దీర్ఘకాలిక లిక్విడ్ ఫండ్స్
ఏడాదిలోపే పెద్దగా రిస్క్ లేకుండా అధిక లిక్విడిటీతో స్థిరమైన రాబడులు కావాలనుకున్నా లిక్విడ్ ఫండ్స్‌ను ఆశ్రయించవచ్చు.
బీమా, పెట్టుబడి లాభాల కోసం..
యూలిప్స్, పెన్షన్ ప్లాన్స్ ఎంచుకోవాలి
పెద్దగా రిస్క్ లేకుండా పెట్టుబడి లాభాల కోసం చూసే వ్యక్తులైతే పసిడి, వెండి నేరుగా కొనడం లేదా వాటి ఈటీఎఫ్‌ల్లో మదుపు చేయవచ్చు.
హమీతో కూడిన రాబడుల కోసం
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ఎంచుకోవాలి.
జీవిత చరమాంకంలో ఆర్థిక చేయూత అవసరమనుకుంటే ఎన్‌పీఎస్‌ల్లోనూ మదుపు చేయవచ్చు.
ఈ పెట్టుబడులు ఎవరికి వారు వారి అవసరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. వీలైతే ఎవరైనా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సలహా తీసుకోవడం మరీ మంచిది.