సురేఖ ఇంటికే!.. 3 తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:49 AM
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
3 తర్వాత ముహూర్తం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
3న అధిష్ఠానంతో సీఎం, డిప్యూటీ, పీసీసీ చీఫ్ భేటీ
మంత్రివర్గం, పార్టీ వ్యవహారాలపైనా చర్చించే చాన్స్
1న విదేశీ పర్యటన నుంచి రానున్న కేసీ వేణుగోపాల్
కష్టపడి అధికారంలోకి తెచ్చి.. పదవులిచ్చి గౌరవిస్తే
ఇంట్లో ఉన్న పిల్లలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తారా?
సన్నిహితుల వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన!
తిట్టిస్తే ఊరుకుంటామా.. అంటూ కఠిన వైఖరి
హైదరాబాద్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఓవైపు మంత్రి కొండా సురేఖ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ నుంచి ఏఐసీసీ వద్దకు చేరి ఉత్కంఠ రేపుతుండగా, మరోవైపు పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబరు 3న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పీసీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ సెప్టెంబరు 1న ఢిల్లీకి తిరిగి రానున్నట్లు, అనంతరం ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మూడో తేదీన జరగనున్న చర్చల్లో కొండా సురేఖ వ్యవహారంతోపాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా కీలక నిర్ణయాల దిశగా కసరత్తు జరగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ వివాదానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే ఏఐసీసీకి చేరింది. దీనిపై అదిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయినా.. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ను ఢిల్లీకి పిలిపిస్తుండడంతో కేవలం కొండా సురేఖపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకోవడానికేనా? లేక మొత్తంగా మంత్రివర్గంలో మార్పులు, పార్టీ వ్యవహారాలపై సమగ్ర చర్చ కోసమా? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది.
మంత్రివర్గంలోకి మహేశ్‌గౌడ్?
కొండా సురేఖపై కఠిన నిర్ణయం తీసుకుని, మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తే.. ఖాళీ అయ్యే స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది కూడా ఢిల్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనలు గతం నుంచే వినిపిస్తున్నాయి. అయితే మహేశ్‌గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తే.. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఎస్టీ, బీసీల్లో ఒకరికి ఈ పదవి దక్కవచ్చని, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌ల పేర్లు చర్చల్లో ఉన్నాయని సమాచారం. మరోవైపు ఇంకో మంత్రిని కూడా తొలగిస్తారని, ఆ స్థానంలో మరొకరిని తీసుకుంటారనే అభిప్రాయమూ ఉంది. అదే సమయంలో మంత్రుల శాఖలు కూడా మారతాయి. అయితే ఇదంతా ఒకేసారి జరిగిపోతుందా? లేదంటే ముందు కొండా సురేఖ వ్యవహారం తేల్చి.. ఆ తర్వాత పున ర్వ్యవస్థీకరణకు వెళ్తారా? అన్నది మూడో తేదీన స్పష్టమయ్యే అవకాశాలున్నాయి.
‘ఇలా మాట్లాడితే...ఊరుకుంటామా?’
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిసారిగా స్పందించినట్లు తెలుస్తోంది. శనివారం తనను కలిసిన కొందరు సన్నిహితుల వద్ద రేవంత్ చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు కాంగ్రె్‌సలో కొత్త చర్చకు తెరతీశాయి. ‘‘రాత్రింబవళ్లూ కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. గౌరవించి మంత్రి పదవులు ఇస్తే.. ఇంట్లో ఉన్న పిల్లలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తారా? దేనికైనా ఒక పరిమితి, హద్దు ఉంటుంది కదా! పిల్లలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తే ఊరుకుంటామా? అసలు పార్టీకి, ప్రభుత్వానికి సొంత నేతలే ఇస్తున్న సంకేతమేంటి?’’ అంటూ సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యాఖ్యలు కాంగ్రె్‌సలో ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు బహిరంగంగా పెద్దగా స్పందించలేదు. క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని, ఆ కమిటీ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందేననే ధోరణిలోనే సీఎం మాట్లాడారు. కానీ, రాఖీ పండుగ జరిగిన మరుసటి రోజే సన్నిహితుల వద్ద అందుకు భిన్నంగా ఒకింత కఠిన వైఖరితోనే మాట్లాడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని అంటున్నారు.
చర్చనీయాంశమైన గుత్తా వ్యాఖ్యలు..
కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రె్‌సకు నష్టమని, పార్టీలో లీకేజీలను నియంత్రించి క్రమశిక్షణ కాపాడుకోవాలని ఆయన సుచించారు. గ్రూపు తగాదాలు తగ్గించుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో క్యాబినెట్‌లో మార్పులు, షిఫ్టింగ్‌లు అవసరమని గుత్తా అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి యువకుడని, ఉత్సాహవంతుడని, ఆయనకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పించాలని, పాలనలో ఆటంకాలు సృష్టించకూడదని అన్నారు. గుత్తా చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌లోని తాజా పరిణామాలతో కలిపి చూస్తే.. ఓవైపు సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నట్లు, మరోవైపు పార్టీ లైన్ దాటుతున్న నేతలకు హెచ్చరికగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ నివేదిక, అధిష్ఠానం పరిశీలన, పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడి, తాజాగా సీఎం తన సన్నిహితుల వద్ద చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు.. వీటన్నింటినీ పరిశీలిస్తే కొండా సురేఖ విషయంలో రాజకీయంగా కీలక నిర్ణయం దిశగా పరిణామాలు కదులుతున్నాయన్న చర్చ ఊపందుకుంది. క్యాబినెట్‌లో అతిత్వరలోనే పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
విదేశీ బీఎఫ్‌ఎస్ఐ కంపెనీల ‘జీసీసీ’ హవా
నేపాల్ వరదలు.. నలుగురు భారతీయులను రక్షించిన నేపాల్ ఆర్మీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News