తెలుగుకు తెగులు
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:38 AM
చిన్న పైన్డయల్, అలైర్, మత్యాలపల్లి, ఎత్కాలపల్లి.. ఈ ఊళ్ల పేర్లు ఎక్కడో విన్నట్టుందిగానీ.. ఏదో తేడా కొడుతోందని అనిపిస్తోందా? నిజమే. ఇవన్నీ మన రాష్ట్రంలోని ఊళ్ల పేర్లే. కానీ.. జాతీయ రహదారులపై బోర్డుల్లో ఇలా తప్పులతడకలుగా కనిపిస్తున్నాయి!
జాతీయ రహదారులపై బోర్డుల్లో తప్పులతడకగా ఊళ్ల పేర్లు
చిన్న పైన్డయల్‌గా మారిన చిన్న పెండ్యాల..
అలైర్ అయిన ఆలేరు
ఎత్కాలపల్లి అయిన ఇటుకాలపల్లి..
ఏఐతో కృతక అనువాదాలు
వరంగల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): చిన్న పైన్డయల్, అలైర్, మత్యాలపల్లి, ఎత్కాలపల్లి.. ఈ ఊళ్ల పేర్లు ఎక్కడో విన్నట్టుందిగానీ.. ఏదో తేడా కొడుతోందని అనిపిస్తోందా? నిజమే. ఇవన్నీ మన రాష్ట్రంలోని ఊళ్ల పేర్లే. కానీ.. జాతీయ రహదారులపై బోర్డుల్లో ఇలా తప్పులతడకలుగా కనిపిస్తున్నాయి! నేషనల్ హైవేల సాక్షిగా తెలుగుకు పట్టిన తెగులిది! ఊరి పేరంటే కేవలం అక్షరాల సమాహారం కాదు.. అది ఆ ప్రాంత చరిత్రకు, సంస్కృతికి ప్రతీక. అలాంటి ఊర్లపేర్లు.. కృత్రిమ మేధ కృతక అనువాదాలు, లిప్యంతరీకరణ టూల్స్ చేస్తున్న తప్పుల కారణంగా దారుణంగా మారిపోతున్నాయి.
ఉదాహరణకు.. రాష్ట్రంలో జాతీయ రహదారి 163పైన ఉన్న జనగామ జిల్లా చిన్నపెండ్యాల ఊరు పేరును తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చిన్న పైన్డయల్‌గా మార్చి రాశారు. హిందీలో మాత్రం సరిగ్గా ఉండడం గమనార్హం. అలాగే.. ఇదే రహదారిపై ఉన్న భువనగిరి జిల్లా ఆలేరు.. అలైర్‌గా మారింది. జాతీయ రహదారి 363జీపైన ఉన్న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని ముచ్చింపల్లి గ్రామం పేరు మత్యాలపల్లిగా మార్చేశారు. ఇప్పలతండా గ్రామాన్ని ఇప్పుల్‌తండగా మార్చారు. ఇదే రహదారిపై టోల్‌గేట్ వద్ద నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామాన్ని ఎత్కాలపల్లిగా మార్చేశారు. అలాగే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని ఈదులవాడ గ్రామం ఎదులవాడ అయిపోయింది. నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారిపై పడకల్ గ్రామం కాస్తా.. పడక్కల్ అయితే.. కేశ్‌పల్లి కేశిపల్లి అయ్యింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జాతీయ రహదారుల వెంబడి ఉన్న గ్రామాలపేర్లను ఇలా విచిత్రంగా మార్చేస్తుండడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఊరి పేర్లను ఇలా యథేచ్ఛగా మార్చేడయం సాధారణ అక్షర దోషంగా కొట్టిపారేయలేమని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఆయా ఊళ్లతో సంబంధం లేనివారికి సదరు అక్షర దోషాలు చిన్నపొరపాటుగా కనిపించినా.. తరతరాలుగా ఆ పేరుతోనే గుర్తింపు పొందిన గ్రామాల ప్రజలు దీన్నో అభ్యంతరకరమైన పరిణామంగా భావిస్తున్నారు. ఏఐ ఆధారిత అనువాద వ్యవస్థలు సాధారణంగా తమకు ఇంగ్లి్‌షలో ఇచ్చిన పేర్లను ఆధారంగా చేసుకుని, వాటిని ఇష్టం వచ్చినట్టు అనువదిస్తాయని.. ఆ తప్పు ఒకసారి డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిన తరువాత అదే అనేక వేదికల్లో పునరావృతం అవుతుందని.. చివరకు అసలు పేరుకంటే తప్పుడు పేరే ఎక్కువగా వినిపించే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నారు. కాబట్టి.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రహదారుల నిర్మాణ సంస్థలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసే ఏజెన్సీలు ఊళ్ల పేర్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బోర్డులపై గ్రామాల పేర్లు రాసేటప్పుడు రెవెన్యూ రికార్డులు, గెజిట్ నోటిఫికేషన్లు, స్థానిక అధికారులు, గ్రామ పెద్దల అభిప్రాయాలను తీసుకుని పేర్లను ఖరారు చేయాలని కోరుతున్నారు. అలాగే.. ఇప్పటికే ఉన్న తప్పులను గుర్తించి సరి చేసేందుకు ప్రత్యేక తనిఖీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు
కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్
Read Latest Telangana News And Telugu News