నేటి నుంచి మరో 7 జిల్లాల్లో ‘తొలి ముద్ద’
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:18 AM
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం ప్రవేశపెట్టిన ‘తొలి ముద్ద’ అల్పాహార పథకాన్ని మరో ఏడు జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్తగా 43,657 మంది చిన్నారులకు అల్పాహారం
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు!
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం ప్రవేశపెట్టిన ‘తొలి ముద్ద’ అల్పాహార పథకాన్ని మరో ఏడు జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని భూపాలపల్లి, జనగామ, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. తద్వారా కొత్తగా 43,657 మంది చిన్నారులకు ప్రతి రోజూ ఉదయం బలవర్ధకమైన అల్పాహారం అందనుంది. ఇప్పటికే ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లోని 8,694 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది.
ఏడు జిల్లాల్లో కలిపి సుమారుగా 91,796మంది చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నారు. తాజా విస్తరణతో కలిపి మొత్తం 14 జిల్లాల్లో 1,35,453 మంది చిన్నారులకు ‘తొలి ముద్ద’ అందనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్రంలోని మిగిలిన 19 జిల్లాల్లోనూ అమలు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ‘తొలి ముద్ద’ పథకాన్ని విస్తరించడం.. సంతోషంగా ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నారులు ఆకలితో ఉండకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News