Share News

స్వచ్ఛంద సమాచార వెల్లడితో.. ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:26 AM

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం.. స్వచ్ఛంద సమాచార వెల్లడికి ప్రభుత్వ విభాగాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా స్పష్టం చేశారు.

స్వచ్ఛంద సమాచార వెల్లడితో..  ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!
RTI Transparency Awards 2026

  • చట్టంలోని సెక్షన్‌ 4 ప్రాధాన్యాన్ని గుర్తు చేసిన గవర్నర్‌ శుక్లా

  • పలు శాఖలు, సంస్థలు, అధికారులకు అవార్డుల ప్రదానం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం.. స్వచ్ఛంద సమాచార వెల్లడికి ప్రభుత్వ విభాగాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పథకాలు, అర్హతలు, ప్రక్రియకు సంబంధించిన సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచితే ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. ఆర్టీఐ చట్టం ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం లాంటిదని.. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యానికి ఈ చట్టం పునాది అని ఆయన పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన ‘సమాచార హక్కు వారోత్సవాలు- 2026’లో గవర్నర్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొని ప్రసంగించారు.ఆర్టీఐ చట్టాన్ని సమర్థంగా అమలుచేసి, వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థలు, అధికారులకు గవర్నర్‌ పురస్కారాలు అందజేశారు.


అవార్డు గ్రహీతలు వీరే..

ఉత్తమ స్వచ్ఛంద సమాచార వెల్లడి విభాగంలో నల్గొండ కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌, మహబూబాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌, టీజీ జెన్‌కో సీఎండీ ఎస్‌. హరీశ్‌ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాల కేటగిరిలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ అంకిత్‌, సూర్యాపేట కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయి అవార్డులు పొందారు. ఉత్తమ శాఖల కేటగిరీలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థి శాఖకు పురస్కారం లభించగా, ఆ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అవార్డును స్వీకరించారు.


అలాగే, సచివాలయ ఉత్తమ పనితీరు విభాగంలో ఆర్థిక శాఖకు అవార్డు లభించగా, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు అవార్డును ప్రదానం చేశారు. ఉత్తమ ప్రజా సమాచార అధికారులు(పీఐవో)గా ఖమ్మం కలెక్టరేట్‌ డీఆర్వో రామ్మూర్తి, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎం.ఏ. నజీర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి, తెలంగాణ సమాచార కమిషన్‌ పీఐవో జె. రాము పురస్కారాలు పొందారు. ప్రత్యేక కేటగిరి కింద ఉత్తమ పనితీరు కనబరిచిన సంస్థగా టీజీఆర్టీసీకి సంబంధించి వై. నాగిరెడ్డి, రామగుండం తహసీల్దార్‌ రవీందర్‌రావు అవార్డులు అందుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ

అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే దుష్ప్రచారమా?

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:26 AM