Share News

అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే దుష్ప్రచారమా?

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:15 AM

రాహుల్‌ గాంధీ వ్యవహారశైలిలో విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించినప్పుడు అవి ప్రజాస్వామ్యబద్ధమైనవని ప్రశంసించడం..

అనుకూలంగా ఉంటే ప్రజాస్వామ్యం.. లేకపోతే దుష్ప్రచారమా?
Kishan Reddy

  • రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కుట్రలు: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాహుల్‌ గాంధీ వ్యవహారశైలిలో విచిత్రమైన, ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించినప్పుడు అవి ప్రజాస్వామ్యబద్ధమైనవని ప్రశంసించడం.. ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినపుడు అవే సంస్థలకు విశ్వసనీయత లేదని ఆరోపించడం రాహుల్‌గాంధీకి అలవాటుగా మారిందన్నారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదనే కారణంతో.. ఎన్నికల సంఘాన్ని, కాగ్‌ను, న్యాయవ్యవస్థ, పార్లమెంట్‌ల విశ్వసనీయతను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్‌ దివాళాకోరుతనమేనని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.


కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను పదేపదే అనేక ఎన్నికల్లో తిరస్కరిస్తుంటే అది ఎన్నికల సంఘం తప్పు కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు తమకు అనుకూలంగా లేనప్పుడు వాటిని తప్పుపట్టడం, అత్యున్నత న్యాయస్థానం విశ్వసనీయతను ప్రశ్నించడం కూడా ఆ పార్టీకి అలవాటైందని ఆరోపించారు. అనుకూల రాజకీయ కథనాలను ప్రచారం చేసుకునేందుకు అంతర్జాతీయ వేదికలను, విదేశీ మీడియాను వాడుకునేందుకు సైతం రాహుల్‌ వెనుకాడలేదన్నారు. దేశవ్యాప్తంగా 6 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ రాద్ధాంత రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు. భారత్‌లో ‘ఓట్‌ చోరీ’ లేదని, ‘ఓట్‌ దూరీ’ మాత్రమే ఉందని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శివార్ల నుంచి ముంగిళ్లలోకొచ్చి బతుకమ్మగా పువ్వుల నవ్వులు!
ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ కూటమి విజయం

రూ.1000 కోట్ల లావాదేవీలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:15 AM