రైస్ మిల్లర్ల బంద్ విరమణ
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:44 AM
రైస్ మిల్లర్లు కొద్దిరోజులుగా పాటిస్తున్న సమ్మెను విరమించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా తాము పాటిస్తున్న సమ్మెను విరమిస్తున్నామని రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం ప్రకటించింది.
మంత్రి ఉత్తమ్ లిఖితపూర్వక హామీతో మిల్లర్ల సంఘం నిర్ణయం
నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకోనున్న మిల్లులు
పంజాగుట్ట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రైస్ మిల్లర్లు కొద్దిరోజులుగా పాటిస్తున్న సమ్మెను విరమించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా తాము పాటిస్తున్న సమ్మెను విరమిస్తున్నామని రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం ప్రకటించింది. తమ 13 డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడమే కాక, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దీంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులు పని చేస్తాయని పేర్కొంది. తెలంగాణ ఉద్యమకారుడు రఫీతో కలిసి హైదరాబాద్, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి వివరాలు వెల్లడించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఒప్పందాల సమస్యలు, మిల్లర్లపై పెరుగుతున్న ఒత్తిళ్లపై ప్రభుత్వానికి పలుమార్లు వినతులు అందజేశామని, రాష్ట్రస్థాయిలో ధర్నా నిర్వహించిమన్నారు.
కానీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొద్ది రోజులుగా రైస్ మిల్లులు బంద్ చేశామని చెప్పారు. బంద్ నేపథ్యంలో ప్రభుత్వం మంత్రుల సబ్‌కమిటీతో చర్చలకు ఆహ్వానించిందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులతో జరిగిన చర్చల్లో తమ డిమాండ్లపై మౌఖికంగా హామీ వచ్చినప్పటికీ, తమకు రాతపూర్వక హామీ కోరుతూ బంద్‌ను కొనసాగించామన్నారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో శనివారం మరోసారి చర్చలు జరిపామన్నారు. తమ 13 డిమాండ్లను పరిశీలించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని సంబంధిత కమిషనర్‌కు పంపుతూ రాతపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. మంత్రి రాతపూర్వకంగా ఇచ్చిన హామీని గౌరవిస్తూ బంద్‌ను విరమిస్తున్నామని గణపతిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభించినందున మిల్లుల కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్పందించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే మళ్లీ పోరుబాట తప్పదని స్పష్టం చేశారు. కాగా, రైస్ మిల్లుల బంద్‌తో వాటి తాళం చెవిని కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఉద్యమకారుడు రఫీకి అందజేయగా, బంద్ విరమించడంతో మిల్లులు తెరవడానికి తిరిగి ఆ తాళం చెవిని రఫీ తిరిగిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసిన కేటీఆర్
గాంధీ పరివారానికి బానిసత్వం కాంగ్రెస్ నైజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News