రూ.10వేల కోట్లతో ప్రణాళిక
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:40 AM
రాష్ట్రంలో ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రూ.10వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాబోయే 8 నెలల పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సిద్ధం
సంక్రాంతి తర్వాత ప్రతి నెలా 2వేల కోట్ల పనులు
రాబోయే 8 నెలల పాటు ఎల్‌నినో ప్రభావం
రైతులు ఒక పంటను త్యాగం చేస్తే.. పశుసంపద, పర్యావరణాన్ని కాపాడినట్లే
మేం చెప్తే రాజకీయ కోణం అవుతుంది
పండిట్ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్ వంటి వాళ్లు చెబితే స్పష్టత ఉంటుందనే పిలిచాం
‘క్లైమేట్ కాన్‌క్లేవ్’ సన్నాహక భేటీలో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రూ.10వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాబోయే 8 నెలల పాటు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని చెప్పారు. అందుకే సంక్రాంతి తర్వాత ప్రతి నెలా రూ.2వేల కోట్ల విలువైన పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలని కోరారు. ఒక సీజన్‌లో వరి పంటను త్యాగం చేస్తే పశుసంపద, పర్యావరణాన్ని కాపాడుకున్నట్టు అవుతుందని వివరించారు. ఎల్ నినో ప్రభావం మొదలయ్యే నాటికే బియ్యం నిల్వలను సిద్ధం చేశామని, రెండేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు వచ్చింది తిండిగింజల కరవు కాదని, తాగునీటి కరువని పేర్కొన్నారు. రాబోయే ఎనిమిది నెలల పాటు నీటిని పొదుపుగా వాడాలని పిలుపునిచ్చారు.
కోవిడ్ లాంటి సంక్షోభమే ఎల్‌నినో కూడా అని హెచ్చరించారు. రాష్ట్రంలో పెట్టుబడులతోపాటు పర్యావరణానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహించనున్న క్లైమేట్ కాన్‌క్లేవ్ సన్నాహక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. మంత్రులు ఉత్తమ్, సీతక్క, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘పెట్టుబడులు, పర్యావరణం మధ్య సమతుల్యత పాటించకపోతే భవిష్యత్ తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడుల ఆకర్షణ తోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం పండిట్ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్‌తోపాటు పర్యావరణవేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నాం. వారి సలహాలు, సూచనలతో ప్రత్యేక పాలసీని రూపొందిస్తాం. ఈ క్రమంలోనే క్లైమేట్ కాన్‌క్లేవ్ ఏర్పాటు చేశాం’’ అని సీఎం తెలిపారు.
చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా..
పెట్టుబడుల్లోగానీ, పర్యావరణంలోగానీ గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం తెలంగాణకు లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘800 ఏళ్లకు ముందే మా పూర్వీకులు కుంటలు, చెరువులు మీద దృష్టిపెట్టారు. రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి వరంగల్‌లో అనేక చెరువులను తవ్వించారు. గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. తెలంగాణది చెరువుల చరిత్ర. కానీ అనేక చెరువులు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. అలాంటి చెరువులను, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశాం. కబ్జాదారుల నుంచే కాకుండా కోర్టుల నుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ధనవంతులు తమ ఇళ్ల నిర్మాణాల కోసం, ఫంక్షన్ హాళ్ల కోసం చెరువులను ఆక్రమించారు.
మేం ఆ చెర విడిపిస్తున్నాం. ఇప్పుడు బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు. హైటెక్ సిటీ దగ్గర తమ్మిడికుంట చెరువును పరిరక్షించాం. ఆ చెరువును ఆక్రమించిన వారి నుంచి స్థలాన్ని ఖాళీ చేయించాం. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది’’ అని వివరించారు. మూసీ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా మారిందని, అందుకే ప్రక్షాళన చేసి పరిరక్షించాలని నిర్ణయించామని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వం భావితరాల కోసం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ అంశాలను తాము చెబితే రాజకీయం అవుతాయని.. అందుకే పండిట్ రవిశంకర్, వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్ లాంటి వారు భాగస్వాములైతే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని వారిని తీసుకొచ్చామని వివరించారు. ఎక్కడా కూడా పేదలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని చెప్పారు. భవిష్యత్తులో సుందరమైన మూసీ నదిని తీర్చిదిద్దుతామని, అంతా చూస్తారని పేర్కొన్నారు.
తప్పుచేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదు..
రాష్ట్ర అభివృద్ధికి అనేక పాలసీలు తీసుకువచ్చామని.. క్యూర్, ప్యూర్, రేర్‌గా రాష్ర్టాన్ని విభజించామని సీఎం రేవంత్ చెప్పారు. 3 వేల మంది సిబ్బందితో ఈగిల్ ఫోర్స్ మాదక ద్రవ్యాలను నియంత్రిస్తోందని.. కేంద్రం కూడా ఈగిల్ ఫోర్స్‌ను అభినందించిందని తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారులను, వాడుతున్నవారిని ఎవరినీ వదలడం లేదని.. తాను సీఎం కుర్చీలో నేను ఉన్నంతకాలం తప్పు చేసినవాళ్లను వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఆహార కల్తీ నియంత్రణకు టీజీసేఫ్ తీసుకువచ్చామన్నారు. హైదరాబాద్‌లో డీజిల్ ఆటోలు, ఆర్టీసీ బస్సులను తగ్గిస్తున్నామని, రెండు లక్షల డీజిల్ ఆటోలను ఎలక్ర్టిక్‌గా మారుస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News