పోలీసు ప్రమోషన్ల వివాదానికి తెర..
ABN , Publish Date - Nov 18 , 2026 | 04:54 AM
తెలంగాణ పోలీసుశాఖలో ఏళ్ల తరబడి నలుగుతున్న పోలీసు పదోన్నతుల సమస్యకు మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన కీలక సమావేశంలో పరిష్కారం లభించింది.
ఏళ్ల నాటి నిరీక్షణకు మోక్షం!
డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షలో కీలక నిర్ణయం
1991, 95, 96 బ్యాచ్‌లకు ఊరట
తొలిదశలో 54మంది డీఎస్పీలకు
అదనపు ఎస్పీ పదోన్నతులు
రెండోదశలో 34 ఖాళీలు భర్తీ
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోలీసుశాఖలో ఏళ్ల తరబడి నలుగుతున్న పోలీసు పదోన్నతుల సమస్యకు మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన కీలక సమావేశంలో పరిష్కారం లభించింది. 1991, 95, 96బ్యాచ్‌లలో సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐ) సర్వీసులో చేరిన వారిలో కొందరు ఇప్పటికే ఎస్పీలుగా, అదనపు ఎస్పీలుగా కొనసాగుతుండగా.. మెజార్టీ అధికారులు మాత్రం వివిధ కారణాలతో డీఎస్పీలుగానే ఉండిపోయారు. తమ బ్యాచ్‌మేట్లకు సెల్యూట్ కొట్టలేని నిస్సహయ స్థితిలో వారు ఆవేదన చెందుతున్నారు.
గతంలో సీవీ ఆనంద్ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నప్పుడే ఈ సమస్యపై దృష్టి సారించగా, డీజీపీగా బాధ్యతలు చేపట్టాక దీనిని ఓ కొలిక్కి తెచ్చారు. మంగ ళవారం డీజీపీ కార్యాలయంలో వరంగల్ రేంజ్, హైదరాబాద్ రేంజ్, హైదరాబాద్ సిటీకి చెందిన డీఎస్పీలతో ఆయన సమావేశమయ్యారు. సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్, ఖాళీలు, ప్రమోషన్ల అర్హతలపై చర్చించారు. సుదీర్ఘ కోర్టు వ్యాజ్యాల కారణంగా అర్హులైన అధికారుల కెరీర్ నష్టపోకుండా చూడటమే లక్ష్యంగా ఈ భేటీ జరిగిందని తెలిపారు. ప్రమోషన్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 74ను సవాల్ చేస్తూ కొందరు ఎస్‌ఐలు న్యాయస్ధానాల్లో కేసులు వేయడంతో, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం కాంతారావు కమిటీని నియమించిందని గుర్తు చేశారు. కమిటీ నివేదిక, నిబంధనలు పరిశీలించి అందరి ఆమోదంతో పదోన్నతుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని వివరించారు.
దశలవారీగా పదోన్నతుల ప్రక్రియ..
1991, 95, 96 బ్యాచ్‌లకు సంబంధించి రూపొందించిన ప్రమోషన్ ప్యానెల్ ప్రకారం తొలిదశలో 54మంది అదనపు ఎస్పీ పోస్టులు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు అందుబాటులోకి వస్తాయని డీజీపీ వెల్లడించారు. అలాగే, ఎలాంటి వివాదాలు లేవని 12నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులను ప్రస్తుతం భర్తీ చేస్తామని, తదుపరి దశలో మరో 10 నాన్ క్యాడర్ ఎస్పీ పోస్టులు ఈ ప్యానెల్ ఏడాదికి కేటాయిస్తామని పేర్కొన్నారు. భేటీకి హాజరైన పోలీసు అధికారుల సమ్మతి పత్రం తీసుకుని, ఏకాభిప్రాయ ప్యానెల్‌ను సీఎం రేవంత్ రెడ్డికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు, 2012బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు తమకు ఇప్పటికీ సీఐ(సర్కిల్ ఇన్‌స్పెక్టర్) పదోన్నతులు లభించక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటూ డీజీపీకి వినతి పత్రం అందచేశారు. జీవో 317 అమలు, జోనల్ సిస్టమ్‌లో వచ్చిన మార్పులు, నాన్ ఫోకల్ వింగ్స్‌లో కనీసం రెండేళ్లు పనిచేయాలనే నిబంధన వల్ల ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారుల మధ్య సర్వీస్ గ్యాప్ ఏర్పడిందని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రెండు జోన్లలో ఖాళీగా ఉన్న 75 సిఐ పోస్టులను ప్రత్యేక మినహాయింపు ద్వారా తమ బ్యాచ్ వారికి కేటాయించాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News