Share News

పోలీసు బ్యాండ్‌కు మళ్లీ పూర్వ వైభవం

ABN , Publish Date - Nov 23 , 2026 | 04:18 AM

కనుమరుగవుతున్న పురాతన పోలీసు బ్రాస్‌, పైప్‌ బృందాలకు పూర్వ వైభవం తేవడానికి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక చర్యలు చేపట్టారు.

పోలీసు బ్యాండ్‌కు మళ్లీ పూర్వ వైభవం

  • మౌంటెడ్‌ బెటాలియన్‌ తరహాలో ప్రత్యేక గుర్తింపు

  • బ్యాండ్‌ బృంద సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహక అలవెన్సు

  • అఖిల భారత బ్యాండ్‌ పోటీల్లో రాష్ట్రానికి రజతం

  • విజేతలకు డీజీపీ సీవీ ఆనంద్‌ అభినందన

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కనుమరుగవుతున్న పురాతన పోలీసు బ్రాస్‌, పైప్‌ బృందాలకు పూర్వ వైభవం తేవడానికి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక చర్యలు చేపట్టారు. సంగీత ప్రదర్శనలకే ఇవి పరిమితం కాదని, క్రమశిక్షణ, ఐక్యత, బలగాల గుర్తింపు, గౌరవానికి ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 16-20 తేదీల మధ్య హైదరాబాద్‌లో జరిగిన 27వ అఖిల భారత పోలీసు బ్యాండ్‌ పోటీల్లో తెలంగాణ పోలీసులు ‘బిగిల్‌’ విభాగంలో రజతం సాధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రజత పతక విజేతలను అభినందించిన డీజీపీ ఆనంద్‌.. రాష్ట్ర పోలీసులు చక్కని ప్రతిభ చాటడం గర్వ కారణమన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర పోలీసు బిగిల్‌, బ్యాండ్‌ బృందాలను మరింత సమర్థవంతంగా తీర్చి దిద్దుతామన్నారు. మౌంటెడ్‌ పోలీసు బెటాలియన్‌ తరహాలో వీరికి ప్రత్యేక గుర్తింపు తేవడానికి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్రంలోని కేంద్ర బ్రాస్‌ బ్యాండ్‌ బృందంలో 33 మందికి 21 మంది మాత్రమే ఉన్నారు. వీటిల్లో చేరడానికి యువత నిరాసక్తి వల్ల ఆయా బృందాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్న విమర్శలున్నాయి. కేంద్ర పైప్‌ బ్యాండ్‌లోనూ ఇదే దుస్థితి నెలకొని ఉండగా, ప్రస్తుతం ఉన్న కొద్ది మందిలో నిరుత్సాహానికి తోడు.. వారు పదవీ విరమణ చేస్తే ఈ విభాగాల మనుగడే ప్రశ్నార్థకం కానుండటంతో ప్రత్యేక దృష్టి సారించిన డీజీపీ.. జిల్లా బెటాలియన్ల స్థాయిలో ఈ బృందాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ఆధునిక సంగీత పరికరాల కొనుగోలుతోపాటు సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహక అలవెన్సులు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీసు బ్యాండ్‌లో సభ్యత్వాన్ని గౌరవ ప్రద హోదాగా తీర్చి దిద్దడానికి చర్యలు చేపట్టామన్నారు. ఇక అఖిల భారత పోలీసు బ్యాండ్‌ పోటీల్లో రజత పతకం సాధించిన బృందం ఇన్‌చార్జీ సంతోశ్‌, సభ్యులు స్వామి, వెంకటయ్య, భావన రుషి, రామ్‌లాల్‌, ప్రవీణ్‌ కుమార్‌లకు ఇన్సెంటివ్‌లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ విభాగం ఐజీ గజారావు భూపాల్‌, స్పోర్ట్స్‌ డీఎస్పీ రామారావు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం

ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 04:22 AM