Share News

ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్న తమిళనాడు గవర్నర్: టీపీసీసీ చీఫ్

ABN , Publish Date - May 07 , 2026 | 04:38 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ పార్టీ అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భగా ఆ రాష్ట్ర గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.

ప్రజా తీర్పును అగౌరవ పరుస్తున్న తమిళనాడు గవర్నర్: టీపీసీసీ చీఫ్
TPCC Chief Mahesh Goud

హైదరాబాద్, మే 07: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను ప్రజలు గెలిపిస్తూ తీర్పు ఇచ్చారని.. దానిని ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అగౌరవపరుస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్న తమిళనాడు గవర్నర్.. ప్రజా తీర్పును గౌరవించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తమిళనాడులో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో టీ పీసీసీ చీఫ్ మాట్లాడారు.

108 స్థానాలు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించక పోవడం దురదృష్టకరమని మహేశ్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. గవర్నర్ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేసేదిగా ఉందన్నారు.


గవర్నర్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు.. ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ నుంచి వస్తున్నాయనే అనుమానం తనకు కలుగుతుందన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశమివ్వాలని సర్కారియా కమిషన్‌తోపాటు ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నాయని ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు. గవర్నర్‌కు రాజ్యాంగం చదవడం తెలియదా? లేక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన ఇలా చేస్తున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.


తమిళనాడులో గవర్నర్ ద్వారా పాలించాలని బీజేపీ చూస్తోందని టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 59 సంవత్సరాల ద్రావిడ పార్టీల పాలనకు ప్రజలు చెక్ పెట్టిన.. దానిని అడ్డుకోవడానికి గవర్నర్‌ను ఆయుధంగా వాడుకుంటోందంటూ బీజేపీపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన తర్వాత కూడా టీవీకే పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.


కేరళ పర్యటన పేరుతో మరింత జాప్యం చేయడం యాదృచ్ఛికం కాదు.. కుట్ర రాజకీయాల్లో భాగమే అంటూ గవర్నర్ తీరును ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఎండగట్టారు. విజయ్ రెండుసార్లు రాజ్‌భవన్‌కు వెళ్ళినా వట్టి చేతులతో తిరిగి రావడం చూస్తే గవర్నర్.. రాజ్యాంగ పదవిలో ఉన్న బీజేపీ గేట్‌కీపర్ అని స్పష్టమవుతోందని వ్యంగ్యంగా అన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ హోదా నామ మాత్రమే.. విచక్షణాధికారాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ద్రోహం చేయడమేనని ఈ సందర్భంగా గవర్నర్ తీరును ఆయన ఎండగట్టారు.


కోట్ల మంది ఓట్లు వేసి విజయ్ పార్టీని గెలిపిస్తే.. వారి కలలను గవర్నర్ రాజ్‌భవన్‌లో బంధించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మహేశ్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి.. దాన్ని బీజేపీ రాజకీయ పావుగా వాడుకుంటే దేశంలో ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2026 | 05:21 PM