పామాయిల్ గెలల కొను‘గోల్‌మాల్’!
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:15 AM
తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆయిల్‌ఫెడ్) పరిధిలోని వివిధ జిల్లాల్లో ఉన్న పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల( ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) నిర్వహణకు సంబంధించి అక్రమాలు వెలుగు చూడటంతో సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది.
కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్రమాలు..
రవాణా పేరుతో ఏజెంట్ల దోపిడీ
ఏకంగా ఐడీ, పాసువర్డులు అప్పజెప్పిన అధికారులు!
విచారణకు రంగంలోకి ప్రత్యేక కమిటీ
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆయిల్‌ఫెడ్) పరిధిలోని వివిధ జిల్లాల్లో ఉన్న పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల( ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్) నిర్వహణకు సంబంధించి అక్రమాలు వెలుగు చూడటంతో సమగ్ర విచారణకు ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. పామాయుల్ గెలల సేకరణ, తూకం, రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ నమోదు, రైతులకు చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులను కమిటీ పరిశీలించనుంది. ముఖ్యంగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మూడు పామాయిల్ గెలల సేకరణ కేంద్రాలకు కలెక్షన్ ఏజెంటుగా పనిచేస్తున్న చెలికాని సత్యనారాయణపై విచారణకు ఆదేశించింది.
ఈ జిల్లాల్లో నాలుగు సేకరణ కేంద్రాలు ఉంటే... అందులో మూడు సెంటర్లు సత్యనారాయణ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావటంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించింది. ఆయిల్‌ఫెడ్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం... ఏజెంట్లకు పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల్లో లోడింగ్, రవాణా, ఫ్యాక్టరీలో అన్‌లోడింగ్ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. పామాయిల్ గెలల రవాణా ఛార్జీలు దూరానికి అనుగుణంగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన రవాణా రేటు కనిష్టంగా ఒక టన్నుకు రూ. 550 నుంచి గరిష్టంగా రూ. 1,300 వరకు ఉంది. అయితే, ఆయిల్‌ఫెడ్‌లో దీర్ఘకాలికంగా తిష్టవేసిన అధికారులు, ఏండ్ల తరబడి పాతుకుపోయిన కలెక్షన్ ఏజెంట్లు... మిలాఖత్ అయిపోయి ఈ ధరలు పెంచినట్లు పామాయుల్ రైతుల నుంచి విమర్శలు ఉన్నాయి.
ఈ ఛార్జీలే వల్లే ఏజెంట్లకు పెద్దఎత్తున లాభాలు వస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఏకంగా తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఏజెంట్లకు కట్టబెట్టడంతో వారు రైతులతో నేరుగా వ్యాపారం చేస్తూ.. తప్పుడు ఎంట్రీలతో నిధులు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏజెంట్ సత్యనారాయణకు సంబంధించిన 20 సంవత్సరాల రికార్డులు, లావాదేవీలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటన జారీచేశారు.
నిబంధనల ఉల్లంఘన లేదా ఆర్థికనష్టం జరిగినట్లు తేలితే.. చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిధుల రికవరీ కూడా చేస్తామని జీఎం స్పష్టం చేశారు. విచారణ ఈ రెండు జిల్లాలకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పామాయిల్ గెలల సేకరణ కేంద్రాల లావాదేవీలను పరిశీలిస్తామని వెల్లడించారు. వాస్తవ సాగు విస్తీర్ణం, దిగుబడి, రైతుల ఖాతాల్లో నమోదైన పరిమాణం, తూకం బిల్లులు సరిపోలుస్తామని చెప్పారు. ఇకపై, మీదట ఆయిల్‌ఫెడ్ పరిధిలోని సేకరణకేంద్రాల నిర్వహణను ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
జీతం ఒక లెక్క... జీవితం మరో లెక్క
‘అమ్మకు అక్షరమాల’పై వయోజన మహిళల ఆసక్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News