జీతం ఒక లెక్క... జీవితం మరో లెక్క
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:09 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడి ఇటీవల జైలుపాలైన నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అవినీతిని ఆయన విలాసవంతమైన జీవన విధానమే పట్టించింది.
ఆదాయం రూ.2కోట్లు.. ఆస్తులు రూ.6.13కోట్లు
తన జీవన విధానంతో ఏసీబీ దృష్టిలో పడ్డ లక్ష్మీ భాస్కర్
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడి ఇటీవల జైలుపాలైన నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ అవినీతిని ఆయన విలాసవంతమైన జీవన విధానమే పట్టించింది. తరచూ విదేశీ ప్రయాణాలు చేసే లక్ష్మీ భాస్కర్.. దేశంలోని లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ రిసార్టుల్లో పార్టీలు చేసుకునేవారు. అంతేనా రోజుకో ఖరీదైన కారులో కనిపిస్తూ ఏసీబీ దృష్టిలో పడ్డారు. లక్ష్మీ భాస్కర్ 2007 జూన్‌లో నిమ్స్ ఆస్పత్రిలో రెండో సారి ఉద్యోగంలో చేరారు. లక్ష్మీభాస్కర్ గతంలో నిమ్స్‌లో వైద్యుడిగా పని చేసినప్పుడు ఓ రోగి వద్ద డబ్బు తీసుకుంటూ నాటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావుకు పట్టుబడి ఉద్యోగం కోల్పోయారు.
తర్వాత పెద్దల చలవతో మళ్లీ నిమ్స్‌లో అడుగుపెట్టిన లక్ష్మీ భాస్కర్ పరిపాలనా విభాగంలో పాతుకుపోయారు. అవకాశమున్న ప్రతీచోట డబ్బు వసూళ్లకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2007 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 21న ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేసే వరకు ఆయన ఆదాయం కేవలం రూ.2కోట్లు కాగా ఖర్చులు రూ.94.33లక్షలు, ఆయనకు సుమారు 1.05కోట్లు సేవింగ్స్ ఉండాలి. కానీ, ఏసీబీ కేసు నమోదు చేసే సమయానికి ఆయన స్థిరాస్తుల విలువ రూ.2,75,95,200గా అధికారులు గుర్తించారు. లక్ష్మీభాస్కర్ ఇంట్లోనూ ఇతర ప్రాంతాల్లో జరిపిన సోదాల అనంతరం లక్ష్మీ భాస్కర్ అక్రమార్జన విలువ రూ.6.13కోట్లని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ భారీగానే ఉంటుందని పేర్కొన్నారు. లక్ష్మీ భాస్కర్‌కు సహకరించిన ఇతర ఉద్యోగులు, ఆయన బినామీలపైనా దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తెలంగాణ సాధనకు బాపూ జీవితం అంకితం
‘అమ్మకు అక్షరమాల’పై వయోజన మహిళల ఆసక్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News