ఇచ్చంపల్లి నుంచే అనుసంధానం చేపట్టాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:37 AM
గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం నుంచి కాదని తెలంగాణ తేల్చిచెప్పింది.
పోలవరం నుంచి చేపడితే మాకు లాభం లేదు
ఎన్‌డబ్ల్యూడీఏ పాలకమండలి భేటీలో తెలంగాణ
పోలవరం నుంచే చేపట్టాలి: ఏపీ
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) నుంచి చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం నుంచి కాదని తెలంగాణ తేల్చిచెప్పింది. మంగళవారం జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశం వర్చువల్, ప్రత్యక్ష విధానంలో జరిగింది. ఈ భేటీలో తెలంగాణ అధికారులు మాట్లాడుతూ.. పోలవరం నుంచి గోదావరి- కావేరీ అనుసంధానం చేపడితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. జాతీయ నీటి అభివృద్ధి సంస్థ పాలసీలకు విరుద్ధంగా పోలవరం నుంచి ఈ ప్రాజెక్టు చేపట్టడాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పింది. అనుసంధాన ప్రక్రియలో భాగంగా తెలంగాణ వాటాను పెంచాలని, లభ్యమయ్యే నీటిలో 50:50 శాతం ప్రాతిపదికన కేటాయింపులు జరపాలని కోరారు.
బెడ్తి- హీరేవడ్డేటివాడి నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా.. ప్రతిపాదించిన 16 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి తీసుకోవడానికి అనుమతించారో ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టతనివ్వలేదని అధికారులు గుర్తు చేశారు. కర్ణాటక మాత్రం ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటిని తీసుకెళ్లాలని ప్రతిపాదించిందని, దీనివల్ల జూరాలకు వచ్చే నీటిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఏపీ అధికారులు మాట్లాడుతూ.. గోదావరి- కావేరీ అనుసంధానాన్ని పోలవరం నుంచే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ పథకంలోనే బనకచర్లను కూడా చేర్చాలని కోరారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం బేసిన్‌లో ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టులో బేసిన్‌ను పంచుకునే రాష్ట్రాలకు నీటి హక్కులు ఉంటాయని, బెడ్తి- హీరేవడ్డేటివాడి లింక్‌లో తమకు వాటా ఇవ్వాలని ఏపీ కోరింది. అంతకు ముందు ఎన్‌డబ్ల్యూడీఏ మెంబర్ సెక్రటరీ మాట్లాడుతూ గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టుకు తెలంగాణ, ఏపీలు అంగీకరించాలని కోరారు.
ఈ నెల 5న కృష్ణాబోర్డు సమావేశం
కృష్ణా బోర్డు సమావేశం 5వ తేదీన జరుగనుంది. భేటీకి సంబంధించిన తుది అజెండాకు బోర్డు మంగళవారం తెలుగు రాష్ట్రాలకు పంపించింది. భేటీలో పోలవరం-బనకచర్ల, పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా కట్టడి చేయాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల అమలు తీరును గమనించాలని తెలంగాణ డిమాండ్ చేయనుంది. బ్రిజే్‌ష ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు కృష్ణా జలాలను 50:50 నిష్పత్తితో పంపిణీ చేయాలని పట్టుబట్టనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News