Share News

సామూహిక సెలవులో 1.72 లక్షల మంది

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:32 AM

కాంగ్రెస్‌ మేనిఫెస్టో డే సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టారు.

సామూహిక సెలవులో 1.72 లక్షల మంది
CPS Employees Protest

  • సీపీఎస్‌ ఉద్యోగులు కాంగ్రెస్‌ మేనిఫెస్టో డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

  • హామీ మేరకు ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి

  • లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్కారుకు బుద్ధి చెబుతాం

  • సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ

హైదరాబాద్‌/కవాడిగూడ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ మేనిఫెస్టో డే సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్)ను రద్దు చేసిన పాత పింఛను (ఓపీఎస్‌) విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇలా నిరసన తెలిపినట్లు సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది. 33 జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు శాంతియుత ధర్మ దీక్షలు నిర్వహించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.స్థితప్రజ్ఞ తెలిపారు.


హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిర్వహించిన ధర్మదీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023 ఎన్నికల సందర్భంగా వరంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదన్నారు. దేశంలోని నాలుగు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఓపీఎస్‌ను అమలు చేస్తున్నారని చెప్పారు. ఓపీఎస్‌పై అధ్యయన కమిటీ, ఈహెచ్‌ఎస్‌ కమిటీల్లో తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని, పెండింగ్‌ డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు.


రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగుల్లో అత్యవసర సేవల్లో ఉన్న వారు మినహా సుమారు 1.72 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ అమలు కోసం సీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 23న ఎల్బీ స్టేడియంలో జనజాగరణ సభ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఆ సమావేశంలోనే నవంబరు 17లోపు సీపీఎస్‌పై సమీక్ష చేసి పాత పింఛను విధా నం అమలు చేయాలని తీర్మానం చేశామని.. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సామూహిక సెలవులు పెట్టేందుకు పిలుపు ఇచ్చామని వివరించారు.


హామీని నిలబెట్టుకోవాలి

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్థితప్రజ్ఞ అన్నారు. కొంద రు అధికారులు ఇచ్చే తప్పుడు నివేదికలను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులందరూ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని సీపీఎస్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్‌ శ్రీకాంత్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 18 , 2026 | 04:34 AM