ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు 25,000 ఇవ్వాలి
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:34 AM
ఆయిల్‌పామ్ తాజా గెలలకు టన్నుకు కనీస హామీ ధరను రూ. 25,000గా నిర్ణయించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు రైతు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
ఆదాయ పంపిణీ నిష్పత్తిలో రైతులకు 80 శాతంఇవ్వాలి
ఓఈఆర్, పామ్ కెర్నల్ రికవరీ శాతాల్లో ఎలాంటి కోత వద్దు
తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఎండీకి రైతు ప్రతినిధుల వినతి
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ తాజా గెలలకు టన్నుకు కనీస హామీ ధరను రూ. 25,000గా నిర్ణయించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు రైతు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు దీర్ఘకాలిక సాగుపై భరోసా కల్పించేందుకు తాజా గెలల (ఎఫ్‌ఎఫ్‌బీ) ధరల నిర్ణయ విధానంలో కీలక మార్పులు చేయాలని సోమవారం వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం అమలులో ఉన్న రైతు-ప్రాసెసర్ ఆదాయ పంపిణీ నిష్పత్తిని 75.25:24.75 నుంచి 80:20కి సవరించాలని కోరారు. ఏటా సాగు పెట్టుబడి వ్యయాల పెరుగుదలకు అనుగుణంగా కనీస ధరను పెంచే విధానాన్ని అమలుచేయాలని కోరారు. అలాగే ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ రేషియో (ఓఈఆర్), పామ్ కెర్నల్ నట్ (పీకేఎన్) రికవరీ శాతాలను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని కోరారు.
రానున్న ఆయిల్ ఇయర్ కోసం తాజా గెలల ధరల నిర్ణయ సూత్రాన్ని సమీక్షించి నోటిఫై చేసేందుకు రాష్ట్ర ధరల నిర్ణయ కమిటీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రైతు ప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆయిల్‌ఫెడ్ సాధించిన వాస్తవ, ధ్రువీకరించిన రికవరీ సామర్థ్యం ఆధారంగా ఓఈఆర్‌ను 20.01 శాతంగా, పామ్ కెర్నల్ నట్(పీకేఎన్) రికవరీని 10.08 శాతంగా నిర్ణయిస్తూ ప్రభుత్వం గత ఏడాది జీవో జారీచేసిందని, వచ్చే ఏడాదికి కూడా వాటిని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఫ్యాక్టరీల వాస్తవ రికవరీ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రమాణాల్లో కోత విధించడం వల్ల రైతులకు లభించే ధరపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దశాబ్ద కాలంలో ఆయిల్‌పామ్ సాగు వ్యయాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. వినతిపత్రం కాపీలను వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఉన్నతాధికారులకు పంపినట్లు రైతు కమిటీ సభ్యులు రాంచంద్రారెడ్డి, సొంగలి రాజేశ్వర్, వల్లూరి కృష్ణారెడ్డి, మద్దినేని వెంకటేశ్వర్లు, బండి భాస్కర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News