మోడల్ స్కూళ్లలో 1-12 తరగతులు
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:29 AM
ప్రభుత్వ పాఠశాల విద్యలో సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని స్కూళ్లలో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
1-5 తరగతుల కోసం కొత్త భవనాలు
1,000 మంది ప్రాథమిక ఉపాధ్యాయుల సర్దుబాటు
వచ్చే విద్యా సంవత్సరంలో కొన్ని అందుబాటులోకి..
మూడేళ్లలో పూర్తిగా ప్రారంభించనున్న సర్కారు
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విద్యలో సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 6-12వ తరగతుల వరకే కొనసాగుతున్న మోడల్ స్కూళ్లలో.. ప్రాథమిక తరగతులను సైతం ప్రారంభించేందుకు సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం కొన్నింటిలో ప్రారంభించి.. మూడేళ్లలో అన్ని మోడల్ స్కూళ్లలో 1-12వ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి దీనిపై ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆంగ్ల మీడియం విద్య అందించాలన్న లక్ష్యంతో 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్ల విధానాన్ని దేశవ్యాప్తంగా చేపట్టింది.
ఉమ్మడిరాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోడల్ స్కూళ్లను ప్రారంభించారు. మొదట్లో మొత్తం ఖర్చులో 75శాతం కేంద్రం, 25శాతం రాష్ట్రప్రభుత్వాలు భరించేవి. 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్రం నిధుల శాతాన్ని తగ్గిస్తూ వచ్చింది. 2015లో 50శాతం, 2016లో 25శాతం వాటాగా ఇచ్చిన కేంద్రం... ఆ తర్వాత ఖర్చంతా రాష్ట్రాలపైనే వేసింది. మోడల్ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో 6-12వ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 11, 12వ తరగతులు చదువుతున్న 100 మంది బాలికలకు ఉచిత హాస్టల్ సదుపాయమూ ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రాష్ట్రప్రభుత్వం సీట్ల సంఖ్యనూ పెంచింది. అయితే ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. మోడల్ స్కూళ్లలోనూ 1-12 తరగతులు బోధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్)ను ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా నిర్మాణాలు చేపట్టింది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రారంభించిన టీపీఎస్కు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో ఉన్న మోడల్ స్కూల్లోనే ఆరుట్లలో టీపీఎస్గా ఉన్నతీకరించారు. అలాగే మరో 18 మోడల్ స్కూళ్లను టీపీఎస్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇదే తరహాలో అన్ని మోడల్ స్కూళ్లలో 1-5 తరగతులు ప్రారంభించాలంటే అదనపు తరగతిగదులు, సిబ్బంది అవసరం. ప్రస్తుతం అన్ని మోడల్ స్కూళ్లు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులోనే 1-5 తరగతులకు కొత్త నిర్మాణాలు చేపట్టి అదనపు సిబ్బంది నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ స్కూళ్లలో అదనంగా 1-5 తరగతుల నిర్మాణాలకు రూ.3కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు అవుతుందని అంచనా. ఈ లెక్కన అన్ని మోడల్ స్కూళ్లలో నిర్మాణాలకు రూ.500 కోట్ల నుంచి 900 కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తోంది.
ఆరుట్ల టీపీఎస్లో ప్రాథమిక తరగతుల్లో 600 మంది చేరారు. అలా మోడల్ స్కూళ్లలో ప్రాథమిక తరగతులు ప్రారంభించా.. తరగతికి కనీసం 50మంది చేరినా 250మంది అవుతారు. అంటే కనీసం 50వేల మంది విద్యార్థులు చేరుతారు. వీరికోసం అదనంగా మరో వెయ్యి మంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు. ఈ క్రమం లో సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే.. వాటిని మోడల్ స్కూళ్లలో విలీనం చేసి, అక్కడి ఉపాధ్యాయులను ఇందులో నియమించవచ్చని అధికారులు ప్రతిపాదించారు. ఇప్పుడున్న మోడల్ స్కూళ్లలో అదనపు తరగతులున్న చోట వచ్చే (2027-28) విద్యా సంవత్సరంలోనే ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని మోడ ల్ స్కూల్ ఉపాధ్యాయుల సంఘం స్వాగతించింది. 1-12 తరగతులు ప్రారంభిస్తే ప్రాథమిక విద్య నుంచే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సంఘం అధ్యక్షుడు జగదీష్ పేర్కొన్నారు. ఇందులో పనిచేసే ఉపాధ్యాయులను సైతం పాఠశాలవిద్యలో పూర్తిగా విలీనం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
Read Latest Telangana News And Telugu News