Share News

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని నిర్ణయించాం: మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Sep 08 , 2026 | 05:34 PM

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని నిర్ణయించాం: మంత్రి ఉత్తమ్
Telangana Minister Uttam Kumar Reddy

ఢిల్లీ, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులు, వాణిజ్యాన్ని పెంచాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్ జూనియర్‌తో మంత్రి ఉత్తమ్ ఈరోజు (మంగళవారం) సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు తెలంగాణ – ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించే అవకాశాలపై ఇరువురు మాట్లాడారు.


భారతదేశంలో అత్యధికంగా వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని మంత్రి ఉత్తమ్ వివరించారు. భారీ పరిమాణంలో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ, అవసరమైన అనుభవం తెలంగాణకు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదనపై కార్యదర్శి లారెల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ నుంచి మరింత పెద్ద పరిమాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే విధానంపై చర్చించామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసుకునే బియ్యం అవసరం గణనీయంగా ఉండటం, అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల సంఖ్యను విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుండటం నేపథ్యంలో ఈ చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. పోటీ ధరలు, విశ్వసనీయమైన నాణ్యత, నిర్ణీత సమయంలో సరఫరా చేయగల సామర్థ్యంతో తెలంగాణ దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదని ఉత్తమ్ పేర్కొన్నారు.


బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానాలు, రవాణా, ధ్రువీకరణ ప్రక్రియలు, శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపై కూడా చర్చించామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఈ అంశాలను సంబంధిత అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు పరిశీలించి, వాణిజ్య అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించామని అన్నారు. తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా కార్యదర్శి లారెల్ ఆసక్తి వ్యక్తం చేశారని చెప్పారు. దీనిని స్వాగతించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు బలమైన సామర్థ్యం ఉందని అన్నారు.


ఎగుమతికి అనువైన ఉత్పత్తులు, నాణ్యతా ప్రమాణాలు, అనుమతులు, ఇతర నియంత్రణ నిబంధనలను సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు రంగ ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడంతో రైతులు, రైస్ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని ఇతర వర్గాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ పరిశ్రమలకు స్థిరమైన, లాభదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లను సృష్టించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫిలిప్పీన్స్‌కు బియ్యం, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దీర్ఘకాలంపాటు విశ్వసనీయంగా సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక నైపుణ్యం తెలంగాణకు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో గళమెత్తుతాం: మహేశ్వర్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 08 , 2026 | 06:25 PM