వైద్య విద్యార్థుల మెడపై ఫీజుల కత్తి?!
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:00 AM
కొద్ది రోజుల్లో వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభం కానుండగా.. ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్య ప్రవేశాలకు ముందే ఫీజులు ఖరారు కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.
ఏ, బీ క్యాటగిరీల సీట్లకు ఒకే రకంగా ఫీజు ఉండాలని ప్రైవేటు వైద్య కళాశాలల ఒత్తిడి
సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్
ప్రస్తుతం ‘ఏ’ క్యాటగిరీ సీటు ఫీజు రూ.60 వేలు
‘బీ’ క్యాటగిరీలో కాలేజీని బట్టి రూ.11-13 లక్షలు
ఒకే ఫీజు అమల్లోకి వస్తే విద్యార్థులపై భారం
భారం పడకుండా చూడాలని సర్కారు యోచన
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కొద్ది రోజుల్లో వైద్య విద్య ప్రవేశాలు ప్రారంభం కానుండగా.. ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్య ప్రవేశాలకు ముందే ఫీజులు ఖరారు కావాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏ, బీ క్యాటగిరీల సీట్లకు ఒకే ఫీజు అమలు చేయాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సర్కారుపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్రంలో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇప్పటికే హైకోర్టును సైతం ఆశ్రయించాయి. 85 శాతం సీట్లకు(సీ క్యాటగిరీ మినహా అన్ని సీట్లకు) ఒకే ఫీజు అమలు చేయాలని ఆయా కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30, మరో 3 డీమ్డ్ యూనివర్సిటీలు, 4 మైనారిటీ కాలేజీలు వైద్య విద్యను అందిస్తున్నాయి. డీమ్డ్ వర్సిటీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో 9,550 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లోనే 5,020 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 2510 సీట్లు కన్వీనర్ కోటా(ఏ క్యాటగిరీ) కాగా, యాజమాన్య కోటా(బీ క్యాటగిరీ)లో 1757 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా(సీ క్యాటగిరీ)లో 753 సీట్లు ఉంటాయి. గత ఏడాది కన్వీనర్ కోటా ఫీజు రూ.60 వేలు కాగా, యాజమాన్య కోటాలో రూ.11.25-13 లక్షలు( కాలేజీలను బట్టి), ఎన్‌ఆర్‌ఐ కోటాలో రూ.22-24 లక్షల మధ్య ఉంది. కన్వీనర్ కోటాలోని 2,510 సీట్లకు కూడా బీ క్యాటగిరీ సీట్లతో సమానంగా ఫీజు వసూలు చేసేందుకు అనుమతివ్వాలని ప్రైవేటు కాలేజీలు కోరుతున్నాయి. ఇదే అమలైతే ప్రైవేటులో కన్వీనర్ కోటా సీటు ఫీజు వేల నుంచి ఏకంగా లక్షలకు చేరనుంది. ఈ నేపథ్యంలో కాలేజీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గితే కన్వీనర్ కోటాలో సీట్లు పొందాలనుకుంటున్న విద్యార్థులపై అధిక భారం పడనుంది.
ముగిసిన ఎఫ్‌ఆర్‌సీ బ్లాక్ పీరియడ్
ప్రైవేటు వైద్య విద్య కళాశాలల్లో ఫీజుల పెంపును మూడేళ్లకు ఒక సారి ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) సమీక్షిస్తుంది. వైద్య కళాశాలల్లో ఫీజుల పెంపుపై 2023లో ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయం తీసుకోగా, 2025-26 వరకు అవే ఫీజులు అమలయ్యాయి. మూడేళ్ల బ్లాక్ పీరియడ్ ముగిసిన నేపథ్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌ఆర్‌సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఫీజుల పెంపుపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనగా, కన్వీనర్ కోటా సీట్లకు పది శాతం చొప్పున ఫీజు పెంచుకునే వెసులుబాటును కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, తెలంగాణలో ఎఫ్‌ఆర్‌సీ ఎలాంటి ప్రతిపాదనలు సమర్పిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు.. ఒక వేళ హైకోర్టులో ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా తీర్పు వస్తే ఏం చేయాలన్న దానిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలి. కానీ వేరే ఏ రాష్ట్రంలోనూ ఒకే ఫీజు విధానం అమలు కావడం లేదు. కేవలం తెలంగాణకు చెందిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు మాత్రమే ఒకే ఫీజు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదే జరిగితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఫీజుల పెంపునకు సర్కారు సుముఖంగా లేదని సమాచారం. విద్యార్థులపై భారం పడకుండా, మెరిట్ విద్యార్థులకు నష్టం కలగకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు