దేశానికి రోల్ మోడల్ కానున్న తెలంగాణ భూ సర్వే: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:03 PM
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణలోని అన్ని శాఖలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కరువు బృందం వచ్చినా.. ఆశించిన స్థాయిలో తెలంగాణకు నిధులు వస్తాయని అనుకోలేమని అన్నారు. 13 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అడిగితే.. కేవలం 2 లక్షల ఇళ్లు మాత్రమే ఇచ్చారంటూ పెదవి విరిచారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లెక్కలు, ధరణి సీఐడీ కేసు దాదాపు తుది దశకు వచ్చాయని తెలిపారు. సాంకేతిక అంశాలు - సరైన లెక్కలతో బీఆర్ఎస్ అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో భూ సర్వే వేగంగా జరుగుతుందని.. ప్రతీ జిల్లాలో ఇది జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భూ సర్వే పూర్తి అయితే.. సాధాభైనమా సమస్యలు ఉండవని వివరించారు. భూ సర్వే పూర్తయితే ఫారెస్ట్ నుంచి 26 లక్షల భూమికి క్లియర్ టైటిల్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. భూ సర్వే పూర్తయితే సర్వే నంబర్ కాకుండా స్పెషల్ ఖాతా నంబర్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. భూ సర్వే పూర్తయ్యాక భూమి తక్కువ ఉన్న అర్హులకు ఫైనల్ స్టేజ్‌లో సెట్ చేస్తామని అన్నారు.
వచ్చే మంగళవారం నుంచి మూడు రోజులు ప్రతి జిల్లా చొప్పున సమీక్ష చేయనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరించారు. వాటర్ ప్రూఫ్ పాస్ బుక్‌లను ఉచితంగా QR CODEతో ఉన్నవి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. QR CODEను స్కాన్ భూముల వివరాలు విత్ మ్యాపింగ్ ఉంటుందని తెలిపారు. ఈ డిసెంబర్ నాటికి 23 వందల గ్రామాలు పూర్తి కాబోతున్నాయని.. ఏడాదిన్నరలో రాష్ట్రంలో భూ సర్వే పూర్తి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటారని.. గోల్ మాత్రం తామే కొడతామని అన్నారు.
తెలంగాణ భూ సర్వే. దేశానికి రోల్ మోడల్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్లో గ్రామాల్లోకి వెళ్తానని - రాత్రుళ్లు అక్కడే ఉంటానని.. ప్రజల సమస్యలు వింటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెండు పాస్ బుక్‌లు ఇస్తామని.. ఒకటి రెగ్యులర్.. మరొకటి వ్యవసాయానికి సంబంధించిందని పేర్కొన్నారు. రెండు రంగుల్లో ఈ పాస్ బుక్‌లు ఉంటాయని.. అయితే వాటిపై ఫొటోలు మాత్రం ఉండవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అండాల అక్రమ విక్రయం కేసులో సద్గురు హెల్త్‌కేర్ డైరెక్టర్ల అరెస్ట్
ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ