Share News

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:23 AM

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించి.. ప్రతి కమతానికీ హద్దులు నిర్ణయించి యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
Ponguleti Srinivas Reddy

  • 285 గ్రామాల్లో సర్వే పూర్తి, అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు

  • సర్వే కోసం మరో 400 రోవర్ల కొనుగోలు

  • వచ్చేనెల చివరి నాటికి మొదటి దశ సర్వే పూర్తి

  • పాలేరులో త్వరలో భూధార్‌ కార్డుల జారీ

  • రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి

  • భూ సర్వేపై అధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించి.. ప్రతి కమతానికీ హద్దులు నిర్ణయించి యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఇప్పటికే 285 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు ఇప్పటికే ఉన్న 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు చేసినట్లు వెల్లడించారు. భూ సర్వే పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పారదర్శకంగా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


ఈ మేరకు శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో భూ సర్వేపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలిదశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున రీ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు 285 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు తెలిపారు. నిజానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉప విభాగాలు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడిందన్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకుగాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర రీ సర్వే చేపడుతున్నట్లు వివరించారు.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే..

గతంలో భూముల కొలతలకు ఉపయోగించిన గొలుసులు, కర్రలు, క్రాస్‌ స్టాఫ్‌, మెజరింగ్‌ టేపుల వంటి సంప్రదాయ పరికరాలకు స్వస్తి పలికి.. డీజీపీఎస్‌, రోవర్లు, జీఐఎస్‌, క్యూజీఐఎస్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. వీటి ద్వారా భూముల కొలతల్లో కచ్చితత్వం పెరగడంతోపాటు సర్వే వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా చూడవచ్చని పేర్కొన్నారు. రీ సర్వే పూర్తయిన తరువాత ప్రతి భూ కమతానికీ కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబరుకూ భూధార్‌ కార్డు ఇస్తామని చెప్పారు.


డీజీపీఎస్‌ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్‌ సాప్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉన్నాయని, ప్రస్తుతం వాటి సంఖ్య 2.29 కోట్లకు పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూదార్‌ కార్డులు ఇస్తామని చెప్పారు. తన సొంత నియోజకవర్గం పాలేరులోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో ఉన్న 665 ఎకరాల్లో వంద శాతం రీ సర్వే పూర్తి చేశామని, అక్కడ త్వరలోనే భూదార్‌ పట్టాల పంపిణీ చేపడతామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

వినోదంలో పెను విషాదం

పల్లెకు పోదాం..పండగ చేద్దాం..

మెడికోల కార్‌ రేసింగ్‌కు దంపతుల బలి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:23 AM