Share News

మెడికోల కార్‌ రేసింగ్‌కు దంపతుల బలి

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:53 AM

వాళ్లు వైద్య విద్యార్థులు! మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చదువుతున్నారు! వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ నుంచి రెండు మహీంద్రా థార్‌ కార్లలో మహబూబ్‌నగర్‌కు కార్‌ రేసింగ్‌ పెట్టుకున్నారు!

మెడికోల కార్‌ రేసింగ్‌కు దంపతుల బలి
Mahabubnagar car accident

  • రెండు థార్‌ వాహనాలతో ఠారెత్తించిన మెడికల్‌ స్టూడెంట్స్‌

  • ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఓ కారు

  • భార్య అక్కడికక్కడే మృతి, చికిత్స పొందుతూ భర్త కూడా..

  • భర్త షాకీర్‌పై నుంచి ఒకదాని తర్వాత మరో కారు..

భూత్పూర్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వాళ్లు వైద్య విద్యార్థులు! మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చదువుతున్నారు! వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ నుంచి రెండు మహీంద్రా థార్‌ కార్లలో మహబూబ్‌నగర్‌కు కార్‌ రేసింగ్‌ పెట్టుకున్నారు! మధ్యలో వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది! ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు! డాక్టర్లుగా ప్రాణాలు పోయాల్సిన వాళ్లు ఇంకా వైద్య విద్యార్థులుగా ఉండగానే తీవ్ర నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నారు! బైక్‌ రేసింగ్‌ కారణంగా గతంలో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. కార్‌ రేసింగ్‌కు ఇప్పుడు ఇద్దరు అసువులు బాశారు. ఈ ఘటన భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ గ్రామం వద్ద శుక్రవారం రాత్రి జరిగింది.


పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌కు చెందిన భార్యాభర్తలు ఎండీ షాకీర్‌ (46), షహానా బేగం(40) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రంలో జరుగుతున్న శుభ కార్యానికి బయలుదేరారు. అదే సమయంలో వైద్య విద్యార్థులు వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి మహబూబ్‌నగర్‌కు వెళుతూ రెండు మహీంద్రా థార్‌ వాహనాల్లో అతి వేగంగా దూసుకొచ్చారు. అమిస్తాపూర్‌ దగ్గర రోడ్డు మరమ్మతు జరుగుతుండడంతో ఓ థార్‌ వాహనం అదుపు తప్పి ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో, భార్యాభర్తలు ఇద్దరూ ఎగిరిపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో షహానా బేగం అక్కడికక్కడే మరణించారు. భర్త షాకీర్‌ కాళ్లపై నుంచి ఒకదాని తర్వాత మరొకటిగా రెండు కార్లు వెళ్లడంతో ఆయన కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.


తొలుత ఒక కారు ఢీకొట్టడంతో కిందపడిన షాకీర్‌ కాళ్లపై నుంచి వెనుక వచ్చిన మరో థార్‌ వాహనం తొక్కుకుంటూ వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం మరణించారు. మూడేళ్ల చిన్నారి ఆయారా గాయాలతో బయటపడింది. ఆ దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. కారు నడుపుతున్న వికారాబాద్‌కు చెందిన థర్డ్‌ ఇయర్‌ మెడికల్‌ స్టూడెంట్‌ చాకలి నితిన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆ కారులో అతనితోపాటు పెద్దపల్లికి చెందిన విష్ణువర్థన్‌, ములుగు జిల్లాకు చెందిన వనపర్తి హేమంత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన రెండు కార్లను స్టేషన్‌కు తరలించారు. కాగా, ఆరు నెలల క్రితం బైక్‌ రేసింగ్‌ కారణంగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే కారును బైక్‌ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. అయినా, రేసింగ్‌లను అదుపు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

.. వర్రీ

తెలంగాణలోని 315 మండలాల్లో కరువు

27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 04:53 AM