Share News

తెలంగాణలోని 315 మండలాల్లో కరువు

ABN , Publish Date - Oct 18 , 2026 | 04:45 AM

ఎల్‌నినో కారణంగా తెలంగాణలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కేంద్రం తక్షణమే సాయం అందించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని 315 మండలాల్లో కరువు
Thummala Nageswara Rao

  • తక్షణ సాయం అందించండి

  • కేంద్ర మంత్రి శివరాజ్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి..

  • డిసెంబరు 9న ఖమ్మం రండి: సీఎంకు ఆహ్వానం

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా తెలంగాణలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కేంద్రం తక్షణమే సాయం అందించాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శివరాజ్‌సింగ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన ‘ఖేత్‌ బచావో అభియాన్‌’ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల మాట్లాడారు. తెలంగాణలో ఖేత్‌ బచావో కార్యక్రమాన్ని అక్టోబరు 22 నుంచి నవంబరు 30 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఎరువుల ధరలు, రాయితీలను హేతబద్ధీకరించాలని, ప్రధాన పంటలకు పరిమితి లేకుండా 100 శాతం కనీస మద్దతు ధర కల్పించాలని కోరారు. అలాగే వీబీజీరామ్‌జీ పథకం కింద నిధుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు.


సీతారామ కాలువలను పైపులైన్లుగా మార్చాలి

సీతారామ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ ప్రధాన సమస్యగా మారడంతో.. పంపిణీ కాలువను సాధ్యమైన చోట్ల పైపుల వ్యవస్థగా మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విధానంతో సుమారు 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల వరకు తగ్గుతుందని వెల్లడించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన మంత్రి తుమ్మల.. పలు అంశాలను వివరించారు.


దుమ్ముగూడెం ఆనకట్టపై దాదాపు రూ.30 లక్షల వ్యయంతో మీటరు నుంచి మీటరున్నర ఎత్తు వరకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేస్తే సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే ఖమ్మం నగరంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు నిధులు విడుదల చేయాలని కోరారు. కల్లూరిగూడెం ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీతో పాటు వెలుగుమట్ల హౌసింగ్‌ మోడల్‌ కాలనీని ప్రారంభించేందుకు డిసెంబరు 9న ఖమ్మం రావాలని ఆహ్వానించారు. మరోవైపు భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మార్కెట్‌ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ మంత్రి తుమ్మల ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా తోలెం కల్యాణి, వైస్‌ చైర్మన్‌గా కాకా రాములును నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి

.. వర్రీ

గోవా డ్రగ్‌ పెడ్లర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో వెయ్యిమంది తెలుగోళ్లు !

27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 04:45 AM