.. వర్రీ
ABN , Publish Date - Oct 18 , 2026 | 04:38 AM
ఈ ఇద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతుల ప్రస్తుత దుస్థితి ఇది! కొన్నిచోట్ల పంట ఎండిపోయింది! మరి కొన్నిచోట్ల సగం ఎండింది.. సగం పచ్చగా ఉంది! ఇంకొన్నిచోట్ల నేల కూడా నెర్రెలిచ్చింది! పోయిన పంట పోగా.. ఉన్న పంటను కాపాడుకోవాలంటే రాబోయే 20 రోజులే అత్యంత కీలకం!
రైతన్నకెంత కష్టం!.. కరెంటు లేదు.. పెట్టుబడి ఖర్చులూ రావు
కొన్నిచోట్ల నెర్రెలిచ్చిన నేలలు, ఎండిన పంటలు
మరికొన్నిచోట్ల మాత్రం పొట్ట దశలో వరి పంట
కరెంటు కోతలతో ఆందోళన.. జనరేటర్ల వాడకం
రానున్న 20 రోజులూ పంటకు అత్యంత కీలకం
ఆ తర్వాతే రాష్ట్రంలో కరువుపై కేంద్రానికి నివేదిక
రాష్ట్రవ్యాప్తంగా 53 శాతం కరువు మండలాలే
పలు జిల్లాల్లో 20-40 శాతం దాకా తగ్గనున్న దిగుబడి
ఈ ఇద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది రైతుల ప్రస్తుత దుస్థితి ఇది! కొన్నిచోట్ల పంట ఎండిపోయింది! మరి కొన్నిచోట్ల సగం ఎండింది.. సగం పచ్చగా ఉంది! ఇంకొన్నిచోట్ల నేల కూడా నెర్రెలిచ్చింది! పోయిన పంట పోగా.. ఉన్న పంటను కాపాడుకోవాలంటే రాబోయే 20 రోజులే అత్యంత కీలకం! దాంతో, ఉన్న పంటను అయినా కాపాడుకోగలమా!? అన్న ఆందోళన ఇప్పుడు రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. చివరి దశలో కరెంటు లేక, నీరందక కొందరు రైతులు బాధతో ఉన్న పంటను ధ్వంసం చేసుకుంటున్న పరిస్థితులు అక్కడక్కడ నెలకొంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కరెంటు కోతలే! బోర్లు, బావుల కింద సాగు చేసిన వారికి ఇప్పుడు కరెంటు కోతలు సంకటంగా మారాయి. కోతల కారణంగా ఇప్పటికే కొన్ని చోట్ల అన్నదాతలు జనరేటర్లను వాడుతున్నారు.
నాలుగెకరాలున్న రైతుకు రెండెకరాలకే నీరందుతోంది. మిగిలిన పంటకు నీరందించాలంటే కరెంటు కోతలు ఆటంకంగా మారాయి. అందుకే, కరెంటు కోతలు లేకుంటేనే పంటలు చేతికి వస్తాయని అంటున్నారు. కోతలతో పండలు ఎండే పరిస్థితి నెలకొందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మెజారిటీ జిల్లాల్లో వరి కోతకు రావాలంటే మరో 20-30 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉంది. ఈ దశలో ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఆ తర్వాత వరి కోసే ముందు వారం పది రోజులపాటు తడి అవసరం లేదు. దాంతో, ఈ 20 రోజులే చాలా కీలకంగా మారింది. కనీసం ఈ 20 రోజులైనా కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
3 రకాల నష్టాలను అంచనా వేస్తున్న సర్కారు
ఎల్నినో ప్రభావంతో వాతావరణ మార్పుల కారణంగా పంటలకు తీవ్రమైన తెగుళ్లు సోకడం, సాగు నీరు అందకపోవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొన్ని జిల్లాల్లో పంట దిగుబడి 20-40 శాతం తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కూడా కరువుపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. అందుకోసం మరో 20 రోజులపాటు వేచి చూడాలనే ధోరణితో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం మూడు రకాల నష్టాలను అంచనా వేస్తోంది. తొలుత, అసలు పంటలే సాగు చేయని భూములు ఎన్నో లెక్కలు తీస్తోంది.
ఆ తర్వాత.. పంట వేసి ఇప్పటికే పూర్తిగా ఎండిపోయిన వాటి వివరాలను ప్రాథమికంగా సేకరించింది. ఇక, రాబోయే 20 రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇంకా ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటాయి? అనే స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే మొత్తం ఎన్ని లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయో లెక్క తేలుతుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వేలు చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పంటల ఫొటోలు తీసి అప్లోడ్ చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి పూర్తిస్థాయి నివేదికను పంపాలని నిర్ణయించింది. దాని ఆధారంగా కరువును ఎదుర్కొనేందుకు కేంద్రాన్ని సాయం కోరనుంది.
గణనీయంగా తగ్గిన సాగు
వర్షాభావ పరిస్థితుల కారణంగా వరి సాగు గణనీయంగా తగ్గింది. ఫలితంగా, దిగుబడి తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 69.19 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఈ ఏడాది 57.04 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఫలితంగా, దిగుబడి 30-35 శాతం తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 9,21,445 ఎకరాలు. కానీ, ఈ ఏడాది కేవలం 6.16 లక్షల ఎకరాల్లోనే వరి సాగు చేశారు. అంటే, 33.12 శాతం ఆ ఒక్క జిల్లాలోనే తగ్గింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలకు ఈ ఏడాది 10.10 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
ఈ జిల్లాలో నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో బోర్లలో నీరు ఎండిపోవడంతోపాటు అనధికార విద్యుత్ కోతల కారణంగా తడులు తిరగ లేదు. దీంతో, 4.55 లక్షల ఎకరాల్లో 40 శాతం మేర అంటే దాదాపుగా 1.80 లక్షల నుంచి 2 లక్షల వరకు పంట ఎండిపోయింది. ఇదే పరిస్థితి మెజార్టీ ఉమ్మడి జిల్లాల్లో నెలకొందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. సరిగ్గా పొట్ట దశలో బోర్లలో నీళ్లు ఎండిపోవడం కూడా అన్నదాతకు దెబ్బమీద దెబ్బ పడినట్లయింది. సాధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున ధాన్యం దిగుబడి వచ్చేదని, ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 18-20 క్వింటాళ్ల వరకే రావొచ్చని అంచనా వేస్తున్నారు.
పైర్లు ఎండిపోవడంతో పశువులను మేపుతున్న పరిస్థితి కొన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. ఇక, కొందరు రైతులు పంటలో కొంతైనా దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు ఎకరాలు సాగు చేస్తే.. కరెంటు కోతలు, బోర్లలో నీరు తగ్గడంతో కేవలం రెండు ఎకరాలకే నీరందిస్తూ.. ఉన్న దాన్ని బతికించుకునేందుకు యత్నిస్తున్నారు. పొట్ట దశలో ఉండడంతో మరి కొందరు ఎక్కువ సమయం మోటార్లు నడిపిస్తున్నారు. లోడు ఎక్కువై మోటార్లతోపాటు ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. క్షేత్రస్థాయి విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో వాటి స్థానంలో కొత్తవి పెట్టడం లేదని రైతాంగం వాపోతోంది. ఇది కూడా పంట దిగుబడి తగ్గడానికి కారణమౌతోందని అంటున్నారు. అలాగే, మరికొందరు జనరేటర్లు తీసుకొచ్చి.. 2-3000 రూపాయల డిజిల్ పోసి పంటలను దక్కించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
53 శాతం మండలాల్లో కరువు పరిస్థితులు
తెలంగాణలో మొత్తం 621 మండలాలు ఉండగా.. వాటిలో హైదరాబాద్లోని 16, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 15, రంగారెడ్డి జిల్లాల్లోని 4 మండలాల్లో పంటలు వేసే పరిస్థితులు లేవు. మిగిలిన 589 మండలాల్లోనే పంటలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 101 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వీటిలో అత్యధికంగా గద్వాల జిల్లాలో 13, నల్గొండ జిల్లాలో 13 మండలాలున్నాయి.
వికారాబాద్లో 11, నారాయణపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో పదేసి చొప్పున, వనపర్తిలో 6, రంగారెడ్డిలో 5, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెంలో 4, మేడ్చల్, ఆదిలాబాద్లో 3, యాదాద్రి, సంగారెడ్డి, మహబూబ్నగర్ల్లో రెండేసి, జనగాం, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరో 214 మండలాల్లో మధ్యస్త కరువు పరిస్థితులు నెలకొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వానాకాలం పంటల్లో ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 73,300 ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయినట్లు ప్రభుత్వం ఆ నివేదికలో వెల్లడించింది. మరో 3,01,092 ఎకరాల్లో పంటలు వాడిపోతున్నాయి. ఇంకో 7,43,836 ఎకరాల్లో పంటలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
రాష్ట్రంలో ఫసల్ బీమా ఉండి ఉంటే..
ప్రస్తుతం రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమల్లో లేదు. వాస్తవానికి కేంద్ర ప్రఽభుత్వ పథకమైన దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచీ రాష్ట్రంలో అమలు చేయడం లేదు. పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతంతో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో బీమా ఉండి ఉంటే రైతులకు నష్ట పరిహారం వచ్చేది. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుత పరిస్థితుల్లో బీమా పథకంలోకి చేరితే ఎలా ఉంటుంది, అందుకు కేంద్రం ఒప్పుకుంటుందా అన్న దానిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
నాలుగెకరాల్లో వరి వేశా. పొట్ట దశలోనే నీరు అందలేదు. బోరులోనూ తగ్గాయి. రెండెకరాలకే అందుతున్నాయి. మిగిలిన రెండెకరాలు ఎండిపోయే పరిస్థితి. ఎండిన పంటను పశువుల మేత కోసం కోస్తున్నాం. కనీసం ఉన్న పంటకైనా సాగు నీరందించేందుకు కోతలు లేకుండా కరెంటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
- పి.నారాయణ రెడ్డి, దోమకొండ, నిజామాబాద్ జిల్లా
నాకున్న ఐదెకరాల సొంత భూమితోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. పొట్ట కొచ్చే దశలో బోర్లలో నీళ్లు ఎండిపోయాయి. పైరంతా ఎండిపోయింది. చేసేదేం లేక బర్రెలను మేపుతున్నాను. ఎకరాకు 40 వేల చొప్పుల దాదాపు రూ.3 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయాను.
- గోపాల్, కనగల్, నల్లగొండ జిల్లా
(హైదరాబాద్, ఆంధ్రజ్యోతి నెట్వర్క్)
ఈ వార్తలు కూడా చదవండి
టీజీఎస్పీడీసీఎల్కు 4 నాణ్యతా ధ్రువీకరణలు
గోవా డ్రగ్ పెడ్లర్ కాంటాక్ట్ లిస్ట్లో వెయ్యిమంది తెలుగోళ్లు !
27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!
Read Latest AP News And Telangana News And International