పల్లెకు పోదాం.. పండగ చేద్దాం..
ABN , Publish Date - Oct 18 , 2026 | 05:07 AM
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా హైదరాబాద్‌తోపాటు, వివిధ నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్లు శనివారం కిక్కిరిసిపోయాయి.
ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట
రహదారులపై రద్దీ.. టోల్‌ప్లాజాల వద్ద బారులు
సరిపడా బస్సులు లేక ప్రయాణికుల పడిగాపులు
దసరా పండుగకు గ్రామాలకు బయలుదేరిన ప్రజలు..
ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
రద్దీకి తగినట్లు బస్సులు లేక
ప్రయాణికుల పడిగాపులు
స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీల వసూలు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రెట్టింపు చార్జీలతో దోపిడీ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా హైదరాబాద్‌తోపాటు, వివిధ నగరాలు, పట్టణాల నుంచి ప్రజలు పల్లెబాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్టాండ్లతో పాటు సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, లింగంపల్లి రైల్వేస్టేషన్లు శనివారం కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్, జేబీఎ్సలలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. ప్రధాన బస్టాండ్లపై రద్దీని తగ్గించేందుకు ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
రెగ్యులర్ సర్వీసులతో పాటు ఏపీ, తెలంగాణలోని జిల్లాలకు శనివారం రాత్రి 8 గంటల వరకు 1,500కు పైగా ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉప్పల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ప్రయాణికులతో రద్దీగా మారాయి. సిటీ బస్సులను కూడా పెద్దసంఖ్యలో జిల్లాలకు నడపడంతో గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం సద్దుల బతుకమ్మ పండగ కావడంతో తెలంగాణలోని పలు జిల్లాలకు అర్థరాత్రి 12 గంటల వరకు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడిపారు.
చార్జీలు ఎక్కువ.. బస్సులు తక్కువ
పండుగకు కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసినా రద్దీకి అనుగుణంగా బస్సులు లేవని కొందరు ప్రయాణికులు తెలిపారు. రెగ్యులర్ సర్వీసులను సైతం స్పెషల్ బస్సుల పేరుతో నడుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు విజయవాడ వంటి ప్రాంతాలకు రద్దీని బట్టి రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. బస్సులు, రైళ్లు సరిపడా లేకపోవడంతో వేలమంది నగరవాసులు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు తరలివెళ్లారు.
దీంతో జిల్లాలకు వెళ్లే ప్రధాన దారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. టోల్‌ప్లాజా దాటడానికి అరగంట పడుతున్నట్టు వాహనదారులు అసహనం వ్యక్తంచేశారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై కూడా ఇదేవిధమైన రద్దీ నెలకొంది. గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు శనివారం అరగంట పాటు ఆగాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ పెరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట టోల్‌ప్లాజా వద్ద కూడా శనివారం వాహనాల రద్దీ కనిపించింది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలోని 315 మండలాల్లో కరువు
మెడికోల కార్ రేసింగ్‌కు దంపతుల బలి
Read Latest AP News And Telangana News And International