Share News

వినోదంలో పెను విషాదం

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:01 AM

రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతుల నేపథ్యంలో, డీజే హోరులో వినిపిస్తున్న పాటలకు విద్యార్థినీ విద్యార్థులు జోరుగా డ్యాన్సులు చేస్తున్నారు. సంతోషం, ఉత్సాహంతో నిండిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

వినోదంలో పెను విషాదం
Meena, Sona

  • ఇంజనీరింగ్‌ కాలేజీ ఉత్సవంలో ప్రమాదం

  • విద్యార్థినులు దాండియా ఆడుతుండగా

  • ఈదురుగాలులతో నేలకూలిన లైటింగ్‌ సిస్టమ్‌

  • ఇద్దరు కవలలకు తీవ్రగాయాలు.. ఒకరి మృతి

  • మరో 19 మంది విద్యార్థినులకు గాయాలు

  • నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్‌ కాలేజీలో ఘటన

  • ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి

సరూర్‌నగర్‌, మన్సురాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతుల నేపథ్యంలో, డీజే హోరులో వినిపిస్తున్న పాటలకు విద్యార్థినీ విద్యార్థులు జోరుగా డ్యాన్సులు చేస్తున్నారు. సంతోషం, ఉత్సాహంతో నిండిన ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులకు భారీ లైటింగ్‌సిస్టం కిందపడటంతో.. విద్యార్థులు హాహాకారాలు చేశారు. అప్పటిదాకా కేరింతలతో నిండిపోయిన ఆ ప్రాంతమంతా దుఃఖం, ఉత్కంఠ వ్యాపించాయి. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎ్‌సఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో శనివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కవల అక్కాచెల్లెళ్లు సోనా, మీనా తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స తీసుకుంటూ సోనా మరణించగా, మీనా కోలుకుంది.


మరో 19 మంది విద్యార్థినులు గాయాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎంవీఎ్‌సఆర్‌ కాలేజీ ఆవరణలో శుక్ర, శనివారాల్లో రెండురోజుల పాటు ‘సంగమం-2026’ పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక ఉత్సవాలను ఏర్పాటు చేశారు. శనివారం దాండియా నిర్వహించారు. మైదానంలో విద్యార్థులు, విద్యార్థినుల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. రెండు చోట్లా విద్యుత్‌ లైట్లతో భారీ సెట్టింగ్‌లు వేశారు. డీజే సౌండ్‌లో విద్యార్థినీ విద్యార్థుల డ్యాన్సులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. అదే సమయంలో వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వచ్చి, బలమైన గాలులు వీయడం మొదలైంది. విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలోని హారిజంటల్‌ (అడ్డంగా ఉన్న) లైటింగ్‌ పోల్‌ ఒక్కసారిగా కిందకు ఒరిగింది.


దీంతో దానికి అనుసంధానమై ఉన్న వర్టికల్‌ (నిలువు) లైటింగ్‌ పోల్స్‌ కూడా పడిపోయాయి. హఠాత్తుగా ఈ పరిణామం చోటుచేసుకోవటం, అనేకమందితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయి ఉండటంతో తప్పించుకోవటానికి కూడా వీల్లేకుండా పోయింది. పలువురు విద్యార్థినులు పడిపోయిన పోల్స్‌ కింద నలిగిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ హఠాత్‌ పరిణామంతో విద్యార్థినీ విద్యార్థులు తీవ్రదిగ్ర్భాంతికి గురయ్యారు. రోదనలు, హాహాకారాలు మిన్నంటాయి. కాలేజీ నిర్వాహకులు.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. బీటెక్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని నారాయణదాసు సోనా (18) తీవ్రగాయాలతో కామినేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమె కవల సోదరి మీనా కూడా గాయపడినప్పటికీ.. చికిత్స తీసుకుంటున్న క్రమంలో కోలుకున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.గాయాలపాలైన మరో 19 మంది విద్యార్థినులకు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.


యాజమాన్యం నిర్లక్ష్యం!

ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థిని కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరణించిన విద్యార్థిని కుటుంబానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సానుభూతి తెలిపారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కళాశాలలో జరిగిన ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు, విద్యార్థి సంఘాల నేతలు కళాశాల అద్దాలు పగలగొట్టారు. కార్లను ధ్వంసం చేశారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ నినాదాలు చేశారు.


హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం

ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని సోనా.. బీటెక్‌ ఈఈఈ మొదటి సంవత్సరం విద్యార్థిని. తన కవల సోదరి మీనాతో కలిసి కాలేజీ హస్టల్‌లో ఉంటూ చదువుకుంటుందని ఆమె బంధువులు తెలిపారు. సోనా, మీనాల స్వస్థలం వరంగల్‌. కాలేజీలో జరిగిన ప్రమాద ఘటన గురించి తెలిసి వారి తల్లిదండ్రులు నారాయణదాసు అశోక్‌, లక్ష్మీ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలి వచ్చారు. కుమార్తె మరణంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.


కళ్ల ముందే దారుణం

కాలేజీ ఫెస్ట్‌లో భాగంగా దాండియా ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం కురిసిన వాన చినుకులకు విద్యుత్‌ పోల్స్‌ కింద ఉన్న ఉపరితలం తడిగా మారింది. అదే సమయంలో బలమైన గాలి రావడంతో ఒక్కసారిగా పోల్స్‌ కింద పడ్డాయి. ఫ్రెండ్స్‌తో కలిసి నేను కూడా అక్కడే డ్యాన్స్‌ చేస్తున్నా. నాకు అడుగు దూరంలోనే పోల్స్‌ పడ్డాయి. మా ఫ్రెండ్స్‌ చాలా మందికి గాయాలయ్యాయి.

- బి.హాసిని, కాలేజీ విద్యార్థిని


ఈ వార్తలు కూడా చదవండి

.. వర్రీ

తెలంగాణలోని 315 మండలాల్లో కరువు

మెడికోల కార్‌ రేసింగ్‌కు దంపతుల బలి

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 18 , 2026 | 05:01 AM