రైతుల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:08 AM
రైతుల ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
వచ్చే ఏడాదిలోగా రీ సర్వే పూర్తి చేస్తాం: పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రైతుల ప్రయోజనాల కోసమే రాష్ట్రంలో భూముల రీ సర్వే చేపడుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారం రైతుల సమక్షంలోనే జరగాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే జరిగే గ్రామాల్లో ప్రతీ రోజూ తహసీల్దార్లు పర్యటించాలని, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించడమే కాకుండా వారానికి ఒకసారి గ్రామాలకు వెళ్లాలని సూచించారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని ప్రతీ అంగుళం భూమి సమగ్రంగా సర్వే చేసి భూయజమానులకు వివాద రహిత భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన భూ సమస్యలపై బుధవారం మేడ్చెల్ జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై తక్షణం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచి పనులు చేసే అధికారులను అదే స్థాయిలో గౌరవిస్తామని చెప్పారు. 22ఏ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఇచ్చిన ఆదేశాల్లో, ఉత్తర్వుల్లో కవర్ కాని అంశాలు ఉంటే పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు పర్యటించడం లేదని మంత్రి ఆక్షేపించారు. వారంలో ఒక్క రోజు కూడా గ్రామాలకు వెళ్ల లేని పరిస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కలెక్టర్లు ఎవరూ రీ సర్వేను పరిశీలించడం లేదని తనకు సమాచారం ఉందన్నారు. ప్రతీ కలెక్టర్ తప్పనిసరిగా గ్రామాల్లో రీ సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సదర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక
సైబర్ నేరాల నియంత్రణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ: డీజీపీ ఆనంద్
బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండేలా ‘సర్’ను వాడుతోంది.. ఎంపీ చామల ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News