తెలంగాణ అవకాశాల గని!
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:29 AM
తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
పెట్టుబడులు పెట్టండి.. సహకరిస్తాం
ప్రణాళికాబద్ధంగాభారత్ ఫ్యూచర్ సిటీ
‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’పై చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్/సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని.. పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్-2026లో ఆయన మౌలిక వసతులు, ఎలకా్ట్రనిక్స్, ఐటీ/ఐటీఈఎస్, ఖనిజాలు, తయారీ, టెలికాం, మొబైల్ తయారీ, ఇంజనీరింగ్, పట్టణ రవాణా, బ్యాటరీ సెల్ టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్, ట్రేడ్ ఫెసిలిటేషన్, సరఫరా చైన్, ఔషధ తయారీ, వ్యర్థాల నుంచి విద్యుత్తు తదితర రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఆ తర్వాత ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలోనూ పాల్గొన్నారు. మంత్రి కలుసుకున్నవారిలో బ్రిటన్, అమెరికా, టర్కీ, కెనడా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలు, వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు రావాలని కోరారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా.. నెట్‌జీరో లక్ష్యంతో పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.
అలీన ఉద్యమ స్పూర్తితో కలిసికట్టుగా పనిచేయాలి
నాడు నెహ్రూ ప్రతిపాదించిన అలీన ఉద్యమ స్ఫూర్తితో నేడు అలీన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషించాలని, అందుకోసం అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని భారత్ సమ్మిట్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైటెక్స్‌లో జరిగిన సమ్మిట్‌లో ‘సౌత్ కో ఆపరేషన్ ఇన్ ఎ న్యూవరల్డ్ ఆర్డర్’’పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఇండోనేషియా మాజీ మంత్రి అనీస్ బాస్వడాన్, మాజీ ఎంపీ నూరుల్, కామెరూన్ మంత్రి జోష్ ఓసిష్ పాల్గొనగా, ఎంపీ శంకర్ ఉజ్లకా మెంటార్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు అలీన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. భారత్ సమ్మిట్‌లో కొత్త విషయాలు నేర్చుకునేందుకు వచ్చానని ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రొఫెసర్ మారియో అగూజ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష
ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News