Share News

కోటి కుటుంబాలకు బీమా.. రేషన్‌కార్డే ప్రామాణికం!

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:43 AM

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

కోటి కుటుంబాలకు బీమా.. రేషన్‌కార్డే ప్రామాణికం!

  • రూ.5 లక్షలతో ఇన్సూరెన్స్‌..

  • 18-59 ఏళ్ల వయసున్నవారు అర్హులు

  • వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు

  • అర్హులను తేల్చేందుకు వడపోత

  • రైతుబీమా సహా బీమాలన్నీ ఇందులోనే

  • ఐటీ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు?

  • ప్రక్రియ అమలుపై త్వరలో తేదీలు ఖరారు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కుటుంబ యజమాని దురదృష్టవశాత్తూ దూరమైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తీసుకురాబోతోంది. ఇంటిపెద్ద మరణించిన కుటుంబానికి ఈ బీమా పథకం కింద రూ.5 లక్షలు అందించనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే 2026-27 బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లను కేటాయించింది. రాష్ట్రంలోని కోటికి పైగా కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హతకు తెల్లరేషన్‌ కార్డును ప్రామాణి కంగా తీసుకోనున్నారు.


అంటే.. ఒక కుటుంబాన్ని యూనిట్‌గా పరిగణించి దాని ప్రకారం బీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు (పథకాలకు అర్హులుగా ఉన్న స్థాయివారు మినహా) ఈ బీమా పథకానికి అనర్హులు కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలు, వివిధ పథకాల ద్వారా బీమా పొందుతున్న వారందరినీ ఇందిరమ్మ జీవిత బీమా కిందకు తీసుకురానున్నారు. ఈ మేరకు కుటుంబాల వారీగా ప్రస్తుతం ఏ ఇంట్లో ఎవరెవరికి బీమాలు ఉన్నాయి, వారిలో ఎవరు అర్హులనే వివరాలను సేకరించనున్నారు. కాగా బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, అర్హుల వడపోత, అమలుకు ప్రభుత్వం త్వరలోనే తేదీలను ఖరారు చేయనుంది. గ్రామాల్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి దరఖాస్తులను స్వీకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.


రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్‌కార్డులు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకానికి రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నారు. అలాగే 18 నుంచి 59 ఏళ్ల వయసు వారిని అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,63,884 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 18-59 ఏళ్ల వయసున్నవారు ఎంతమంది, అందులో అర్హులు ఎంతమంది ఉంటారనే వివరాలను తేలుస్తారు. ఆ తరువాత రేషన్‌ కార్డులు లేనివారు ఎంతమంది, అందులో ఎవరైనా అర్హులు ఉన్నారా.. అనే వివరాలను పరిశీలించి వారినీ పథకంలోకి తీసుకువచ్చేలా మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిసింది. కాగా, ప్రస్తుతం నేతన్న, గౌడన్న, ఇతర కార్మికులకు ఆయా శాఖల నుంచి బీమా అందుబాటులో ఉంది. వాటిలో కొన్ని పథకాల్లో బీమా రూ.5 లక్షల కంటే తక్కువ ఉండగా, కొంతమందికి రూ.2 లక్షలు మాత్రమే ఉంది. ఇప్పుడు వారందరినీ ఇందిరమ్మ బీమా కిందకు తీసుకువచ్చి అందరికీ రూ.5 లక్షల బీమా కల్పించనున్నారు.


రైతుబీమా విలీనం..

వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న రైతుబీమా పథకాన్ని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాలోకి విలీనం చేయనున్నారు. దీంతో ఇందిరమ్మ బీమా పథకంలో దీని అమలు ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 42 లక్షల మంది రైతులకు రైతు బీమా పథకం వర్తిస్తుంది. భూమి ఉండి, అర్హత ఉండి, ఇంట్లో ఎంతమంది ఉన్నా, ఒక్కొక్కరికి గుంట భూమి ఉన్నా (18-59ఏళ్ల లోపు వారికి) అందరికీ రైతుబీమా పథకం అమలవుతోంది. ఎవరైనా రైతు అకస్మాత్తుగా మరణిస్తే ఈ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నారు. గత (2025-26) బడ్జెట్‌లో రైతు బీమా పథకం కోసం రూ.1,167 కోట్లను కేటాయించగా, 2026-27 బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించలేదు.


దీంతో రైతుబీమాను విలీనం చేస్తారా, లేదంటే మొత్తానికే రద్దు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ రైతుబీమా పథకాన్ని ఇందిరమ్మ జీవిత బీమా పథకం కిందకు తీసుకువచ్చిన తరువాత ఒకే ఇంట్లో ఇద్దరికి పాసుపుస్తకాలు ఉండి, వారిద్దరూ రైతుబీమాకు అర్హులై ఉంటే.. అప్పుడు ఆ ఇద్దరిలో ఎవరికి ఇందిరమ్మ బీమా కల్పిస్తారన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాలన్నింటికీ మార్గదర్శకాల్లో స్పష్టత రానుంది. అయితే పథకం అమలులో కీలకమైన.. బీమా కంపెనీల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఆ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని, చర్చల అనంతరం టెండర్లను ఆహ్వానించి ఖరారు చేస్తారని ఓ అధికారి తెలిపారు.


ఇందిరమ్మ చీరెల పంపిణీ వాయిదా.. అచ్చంపేటలో ప్రారంభం

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసే కార్యక్రమం వాయిదా పడింది. గురువారం సిద్దిపేటలో నిర్వహించే సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించాలనుకున్న ఈ నెల 26కు వాయిదా వేశారు. 26న ముఖ్యమంత్రి అచ్చంపేట నియోజకవర్గానికి వెళ్లనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆ సభలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే కొత్తగా జాబితాలోకి వచ్చిన 4,63,857 మందికి చేయూత పింఛన్ల కింద అదే రోజు వారి ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్‌ఎస్‌ నేతల్లో ఆధిపత్య పోరు

అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 04:44 AM