కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి కలెక్టర్‌కు ఊరట
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:26 AM
ఓ కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది.
జైలుశిక్ష ఉత్తర్వులను సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు ఆదేశాల అమలులో జాప్యం
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఓ కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన ఆరునెలల జైలుశిక్ష ఉత్తర్వులను డివిజన్ బెంచ్ గురువారం సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ రెవెన్యూ గ్రామ పరిధిలోని మన్నె ముత్యాలమ్మ కుంటలో పిటిషనర్లు పీ శివలీల, పీ వెంకటేశ్వర్లులకు చెందిన ప్లాట్ నెంబర్లు 62, 59లను రిజిస్ట్రేషన్ యాక్ట్ - 1908 సెక్షన్ 22ఏ (నిషేధిత జాబితా) నుంచి 60 రోజుల్లో తొలగించాలంటూ గతంలో సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు.
ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో పిటిషనర్లు కలెక్టర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేలడంతో ఆయనకు ఆరునెలల జైలుశిక్ష, జరిమానా పడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీల్ చేయగా జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ రేణుకలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. కలెక్టర్ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆ ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి కలెక్టర్ చేసిన ప్రయత్నాలను వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై సస్పెన్షన్ విధిస్తూ విచారణను వచ్చే ఏడాది జనవరి 5కు వాయిదా వేసింది. అయితే ప్లాట్ల విషయమై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆరువారాల్లో అమలు చేసి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News