చిన్నారుల అక్రమ రవాణా, దత్తతలపై హైకోర్టు ఫైర్!
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:20 AM
రాష్ట్రంలో గుట్టుగా సాగుతున్న అక్రమ దత్తతలు, చిన్నపిల్లల విక్రయాలు, మానవ అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యం నమోదు
హైదరాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గుట్టుగా సాగుతున్న అక్రమ దత్తతలు, చిన్నపిల్లల విక్రయాలు, మానవ అక్రమ రవాణాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభావవంతంగా జువెనైల్ జస్టిస్ చట్టం-2015 అమలు పై ప్రత్యేక దృష్టి సారించిన హైకోర్టు చట్టానికి చిక్కకుండా, చీకటి దందాలు సాగిస్తున్న ముఠాల ఆట కట్టించడానికి ఈ వ్యవహారంపై స్వచ్ఛందంగా (సుమోటో) ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. హోం, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, డీజీపీ (సేఫ్టీ వింగ్)లను ప్రతివాదులుగా చేర్చింది. కోర్టుకు సహకరించడానికి సీనియర్ న్యాయవాది బి.మయూర్‌రెడ్డిని అమికస్ క్యూరీగా నియమించింది. నల్గొండ జిల్లా చిన్న సూరారం మండలానికి చెందిన ముత్తినేని వెంకన్న దంపతులు, ఆడ శిశువును అక్రమంగా దత్తత తీసుకోగా.. అధికారులు గుర్తించి ఆ పాపను శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
అయితే, ఆ బిడ్డను తిరిగి తనకే అప్పగించాలని కోరుతూ వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టేశారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. వివరాలు సమర్పించాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్ మరోసారి చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ‘చిన్నారుల అక్రమ రవాణా, అక్రమ దత్తతలపై రాష్ట్రంలో 30 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 176 మందిని నిందితులుగా చేర్చారు. 61 మంది చిన్నారులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ శిశు గృహల్లో ఉంచారు.
ఈ చిన్నారుల్లో 26 మంది కన్న తల్లిదండ్రులను గుర్తించగా, మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని ఆయా శాఖలు కోర్టుకు నివేదించాయి. ఈ వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. చిన్నారుల అసలు తల్లిదండ్రులు ఎవరన్నది తేలకపోవడం, విక్రయించిన మధ్యవర్తులు పరారీలో ఉండటం వంటి చిక్కుముళ్లు ఎన్నో ఉన్నాయని గుర్తించింది. ఈ వ్యాజ్యంపై అక్టోబర్ 5న విచారణ నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు ముత్తినేని వెంకన్న నుంచి స్వాధీనం చేసుకున్న చిన్నారి అసలు తల్లిదండ్రులు ఎవరన్నది తేలలేదు. వారికి చిన్నారిని విక్రయించిన నిందితుడు సైతం పరారీలో ఉండడంతో.. ఈ కేసును ప్రత్యేకంగా విచారిస్తామంటూ, అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎర్రవల్లిలో కొనసాగిన సర్వే
భక్తే శ్వాసగా ఈశ్వరమ్మ.. గుట్టపైనే తుదిశ్వాస!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News