Share News

కేంద్రీకృత టెండర్ల ప్రక్షాళన!

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:27 AM

రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు కేంద్రీకృత టెండర్ల (సెంట్రలైజ్డ్‌ టెండర్స్‌) ద్వారా సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

కేంద్రీకృత టెండర్ల ప్రక్షాళన!

  • గురుకులాలకు సరుకుల సరఫరాలో దిద్దుబాటు చర్యలు

  • నిత్యావసర సరుకుల నాణ్యత పరీక్షలకు సర్కార్‌ ఆదేశం

  • టీజీసేఫ్‌ ల్యాబ్‌కు 48 రకాల శాంపిల్స్‌ పంపిన గిరిజన సంక్షేమ శాఖ..

  • 15 రోజుల్లో నివేదికివ్వాలని ఆదేశం

  • ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు కేంద్రీకృత టెండర్ల (సెంట్రలైజ్డ్‌ టెండర్స్‌) ద్వారా సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యత లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సరుకుల నాణ్యతను కచ్చితంగా తేల్చేందుకు వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించాలని అధికారులను ఆదేశించింది. దీంతో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 48 రకాల నిత్యావసర సరకుల సీల్డ్‌ నమూనాలను (శాంపిల్స్‌) హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని ‘తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ల్యాబొరేట రీ’(టీజీఎ్‌సఏఎ్‌ఫఈ) డైరెక్టర్‌కు పంపారు. 2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ) ద్వారా ఎంపికైన కాంట్రాక్టర్లు సరఫరా చేసిన ఈ సరకుల నాణ్యతపై నివేదిక ఇవ్వాలని కోరారు.


కేంద్రీకృత టెండర్ల వ్యవహారంలో జరిగిన లోపాలు, అవకతవకలు, అక్రమాలపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించటంతో అధికార యంత్రాంగం కదిలింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2026 (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా- ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి నమూనాను క్షుణ్ణంగా విశ్లేషించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏదైనా సరుకు నాణ్యత పరీక్షలో విఫలమైతే, ఏయే పారామీటర్లలో లోపాలు ఉన్నాయో వివరంగా తెలపాలని సూచించారు. న మూనాలు అందిన 15 రోజుల్లోగా శాంపిల్‌ కోడ్‌లను ఊటంకిస్తూ నేరుగా తమ కార్యాలయానికి పరీక్షా ని వేదికలను పంపాలని గిరిజన సంక్షేమశాఖ గడువు విధించింది. సరుకుల నాణ్యతలో లోపాలున్నట్లు తేలి తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


గందరగోళంపై సీఎం సీరియస్‌

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర సంక్షేమ గురుకులాలకు ఒకే విధానంలో నాణ్యమైన సరుకులను సరఫరా చేయడం, కొనుగోళ్లలో పారదర్శకత తీసుకురావడం, విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి కేంద్రీకృత టెండర్ల విధానాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ విధానం అమలులోకి వచ్చిన కొద్దికాలానికే సరఫరా వ్యవస్థలో అనేక సమస్యలు వెలుగుచూశాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు సకాలంలో సరుకులుసరఫరా చేయకపోవడం, కొన్నిచోట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.కేంద్రీకృత టెండర్ల విధాన అమలులో తలెత్తిన సరఫరా గందరగోళంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల స్వయంగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.


కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆరంభంలో చిన్నచిన్న ఇబ్బందులు తలెత్తితే సమర్థంగా అధిగమించాలి తప్ప ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ విధానం నుంచి వెన క్కి తగ్గేది లేదని తేల్చిచెప్పినట్లు తెలిసింది. సరఫరాలో గంగరగోళంపై సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులతో పాటు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. నిర్ధేశిత గడువులోగా నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలని ఆదేశించారు. జాప్యం చేసినా, నాణ్యతలో రాజీపడినా సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడంతో ప్రక్షాళన దిశగా అధికారులు దృష్టి పెట్టారు. వాస్తవానికి ఈ టెండర్ల నిర్వహణలో కొందరు అధికారుల కక్కుర్తి వల్లే భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్హతలేని సంస్థలకు సరఫరా బాధ్యతలు కట్టబెట్టడం, టెండర్ల దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్లు నేరగా సరఫరా చేయకుండా సబ్‌కాంట్రాక్టర్లకు అప్పగించడతో నాణ్యత ప్రమాణాలు గాడితప్పాయి. ప్రస్తుతం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించటంతో కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 03:27 AM