నేటి నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం
ABN , Publish Date - Apr 01 , 2026 | 07:30 AM
వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంపిణీకి రేషన్ షాపుల్లో ఏర్పాట్లు
వేసవి దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: వేసవి దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం పరిధిలో గల అల్మాస్గూడ, గుర్రంగూడ, నాదర్గుల్, బడంగ్పేట్, జల్పల్లి, మామిడిపల్లి, బాలాపూర్, కుర్మల్‌గూడ, వెంకటాపూర్ తదితర గ్రామాల్లోని రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి అధికారులు, డీలర్లు సన్నద్ధమయ్యారు. అవసరమైన బియ్యం నిల్వలు ఉన్నందున డీలర్లు తమ షాపులకు తీసుకెళ్లాలని ఇప్పటికే జిల్లా స్థాయి సివిల్ సప్లయీస్ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు డీలర్లు తమ షాపుల పరిమాణాన్ని బట్టి బియ్యం తెచ్చిపెట్టుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నెలాఖరుదాకా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నది. ప్రభుత్వం డీలర్లకు దశలవారీగా బియ్యం సరఫరా చేయనున్నది.
ఒక్కొక్కరికి 18కిలోలు
ప్రస్తుతం రేషన్‌కార్డులు ఉన్న లబ్ధిదారుల్లో ఒక్కొక్కరికినెలకు 6కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలకు 24కిలోలు ఇచ్చేవారు. కాగా ఏప్రిల్‌లో మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఒక్కో వినియోగదారుడికి 18కిలోలు ఇవ్వనున్నారు. ఆ లెక్కన నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి ఒకేసారి 72కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.

ఒక్కొక్కరి వేలిముద్ర మూడు సార్లు..
ఒకేసారి మూడు నెలల బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో లబ్ధిదారులు ఈ-పోస్ మెషీన్లో మూడు సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దాంతో ఒక్కో వినియోగదారుడికి బియ్యం ఇవ్వడానికి సమయం కాస్త ఎక్కువ పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు తమకు సహకరించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
బాలాపూర్ మండలంలో 2,324 మెట్రిక్ టన్నులు
బాలాపూర్ మండలంలో మొత్తం 35,487 మంది సన్నబియ్యం లబ్ధిదారులు ఉన్నారు. సదరు కార్డుదారులకు మూడు నెలలకు కలిపి మొత్తం 2,324.226 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఏప్రిల్ నెలాఖరుదాకా బియ్యం పంపిణీ చేస్తాం.
టేకుల శశిధర్‌రెడ్డి, రేషన్ డీలర్ల సంఘం
బాలాపూర్ మండల కమిటీ అధ్యక్షుడు
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం
Read Latest Telangana News and National News