మరో వివాదంలో బెన్ డకెట్.. భారీ జరిమానా విధించిన కోర్టు
ABN , Publish Date - Apr 01 , 2026 | 06:50 AM
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుని చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకుని చిక్కుల్లో పడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఓ పాత కేసులో శిక్షను ఎదుర్కొన్నాడు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకు డకెట్‌కు కోర్టు భారీ జరిమానా విధించింది. 2025 ఆగస్టులో స్టోక్ సమీపంలో అతివేగంగా కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
స్పీడ్ గన్‌తో పోలీసులు డకెట్ కారును పట్టుకున్నారు. వేగం పరిమితి చాలా ఎక్కువగా ఉండటంతో కేసు పరిధి జరిమానా దాటి కోర్టు వరకు వెళ్లింది. కానాక్ మేజిస్ట్రేట్స్ కోర్టులో డకెట్ నేరాన్ని అంగీకరించడంతో అతడికి 700 పౌండ్ల జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్‌పై 4 పెనాల్టీ పాయింట్లు, 120 పౌండ్ల కోర్టు ఖర్చులు, 280 పౌండ్ల బాధితుల సర్‌చార్జ్ విధించారు. దీంతో డకెట్ మొత్తంగా 1,100 పౌండ్లు చెల్లించాల్సి వచ్చింది.
అయితే బెన్ డకెట్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. 2015లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్నాడు. 2017లో యాషెస్ సిరీస్‌లో సహచరుడు జేమ్స్ ఆండర్సన్‌పై దురుసుగా ప్రవర్తించడంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2026లో డకెట్ ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఈ సీజన్ వేలంలో ఢిల్లీ అతడిని రూ.2కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆఖరి నిమిషంలో ఐపీఎల్‌లో పాల్గొనబోమని తేల్చి చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, చివరి నిమిషంలో సరైన కారణం లేకుండా లీగ్ నుంచి తప్పుకున్న ప్లేయర్లపై 2-3 ఏళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?