Share News

వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలి: మైఖేల్ వాన్

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:42 PM

గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.

వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలి: మైఖేల్ వాన్
Michael Vaughan

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం చర్చ అంతా ఈ యువ సంచలనం గురించే! కేవలం 14 ఏళ్లకే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి.. సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఇటీవలే 15వ పుట్టినరోజు జరుపుకున్న వైభవ్.. గువాహటి వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచులో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇటీవల అండర్ 19 ప్రపంచ కప్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో 175 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఉన్న వయసు అడ్డంకి కూడా తొలగిపోయింది. దీంతో జాతీయ జట్టులోకి వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ బీసీసీఐకి ఓ కీలక సూచన చేశాడు.


‘వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడా? అని ఎదురుచూస్తున్నా. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అతడి గేమ్ ఏంటో చూశాం. రాబోయే కొద్ది నెలల్లో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఒకవేళ నేనే భారత క్రికెట్‌లో ఉండుంటే.. వైభవ్‌కు అవకాశం కల్పించేవాడిని. ఒకేసారి తుది జట్టులో అవకాశం ఇవ్వమని కూడా చెప్పను. అలా ఇచ్చినా పెద్ద నష్టమేం లేదు. కనీసం స్క్వాడ్‌లోకి తీసుకుంటే.. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్ అనుభవమైనా వస్తుంది. రాజస్థాన్ జట్టు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అన్ని ఫార్మాట్ల ప్లేయర్. అయితే వైభవ్ వచ్చాక అతడిని సాధారణ ప్లేయర్‌గా మార్చారని నేను అనుకోవడం లేదు. యశస్వి బంతిని చూసి ఆడుతున్నాడు. వైభవ్ మాత్రం తన సహజసిద్ధంగా బంతిని స్టాండ్స్‌లోకి పంపించేందుకే మొగ్గు చూపిస్తున్నాడు. ఇటువైపు యశస్వి ఉండటంతో సూర్యవంశీకి స్వేచ్ఛ లభించినట్లైంది’ అని వాన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

విషాదం.. ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?

Updated Date - Mar 31 , 2026 | 05:42 PM