చెన్నైపై పగ తీర్చుకున్న జడేజా.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 31 , 2026 | 02:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే నుంచి రాజస్థాన్ జట్టులోకి వెళ్లిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి సీఎస్కే 127 పరుగులకే కుప్పకూలింది. సీఎస్కే నుంచి రాజస్థాన్ జట్టులోకి వెళ్లిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఈ మ్యాచ్‌లో జడేజా(Ravindra Jadeja) మూడు ఓవర్లు వేశాడు. కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ ప్లేయర్ శివం దూబెతో పాటు సర్ఫరాజ్ ఖాన్ వికెట్లను పడగొట్టి గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేశాడు. జడ్డూ భాయ్ చేసిన సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. రవీంద్ర జడేజా చేసిన గన్ ఫైర్ సెలబ్రేషన్స్‌పై నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. తనను ట్రేడింగ్ ద్వారా వదిలేసినందుకుగాను చెన్నై సూపర్ కింగ్స్‌పై ఈ విధంగా జడేజా పగ తీర్చుకున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గత సీజన్ వరకు చెన్నై హీరోగా పేరుగాంచిన అతడు ఇప్పుడు అదే జట్టుకు విలన్‌గా మారిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
ఐపీఎల్ ప్రారంభమైన 2008లో రవీంద్ర జడేజా తొలిసారి రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్ లో రాజస్థాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడ్డూ భాయ్ కోసం 2012 వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. చివరికి చెన్నై అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను సొంతం చేసుకుంది. మధ్యలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఐపీఎల్ 2026కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్‌కే జడేజాను రాజస్థాన్‌కు బదిలీ చేసింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గుజరాత్‌తో పంజాబ్ ఢీ.. పిచ్ రిపోర్ట్ ఇదే!
అదే మా ఓటమికి కారణం.. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్