కూపర్..సూపర్
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:21 AM
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మజా అందించింది. బ్యాటర్లు విఫలమైన చోట టైటాన్స్ బౌలర్లు కాస్త పోరాడినా....
నేటి మ్యాచ్
ఢిల్లీ X లఖ్‌నవూ
వేదిక లఖ్‌నవూ రా.7.30 నుంచి
పంజాబ్ బోణీ
3 వికెట్లతో గుజరాత్ ఓటమి
ముల్లన్‌పూర్: పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ అభిమానులకు మజా అందించింది. బ్యాటర్లు విఫలమైన చోట టైటాన్స్ బౌలర్లు కాస్త పోరాడినా.. ఐపీఎల్ అరంగేట్ర బ్యాటర్ కూపర్ కానొలి (44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 నాటౌట్) అజేయ ఆటతీరుతో పంజాబ్‌ను ఆదుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ గిల్ (39), బట్లర్ (38), ఫిలిప్స్ (25) మాత్రమే రాణించారు. వైశాక్‌కు మూడు, చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో పంజాబ్ 19.1 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ప్రభ్‌సిమ్రన్ (24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 37) ఆకట్టుకున్నాడు. ప్రసిద్ధ్‌కు మూడు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా కూపర్ నిలిచాడు.
ఆదుకున్న కూపర్-ప్రభ్‌సిమ్రన్
ఓ మాదిరి ఛేదనలో పంజాబ్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ ప్రియాన్ష్ (7) వికెట్‌ను కోల్పోయింది. అలాగే జట్టు మిడిలార్డర్ కూడా దారుణంగా తడబడడంతో ఓ దశలో పంజాబ్ ఓటమి దిశగా సాగింది. కానీ 22 ఏళ్ల వన్‌డౌన్ బ్యాటర్ కూపర్ మాత్రం చివరికంటా నిలిచి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో అతడికి మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సహకరించాడు. ఈ జోడీ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. నాలుగో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ 6,6, కూపర్ 6తో రబాడ 19 రన్స్ సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్‌లోనూ ఈ జంట 13 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 55/1తో నిలిచింది. స్పిన్నర్లను లక్ష్యం చేసుకుని ఈ ఇద్దరూ బౌండరీలు బాదారు. కానీ పదో ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ను రషీద్ అవుట్ చేయడంతో రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇక్కడి నుంచి పంజాబ్ తడబాటు మొదలైంది. సారథి శ్రేయాస్ అయ్యర్ (18) రెండు వరుస సిక్సర్లతో జోరు చూపించాడు. కానీ కూపర్ ఆడిన షాట్ నేరుగా తన చేతికి తాకడంతో శ్రేయస్ గాయపడ్డాడు. దీంతో చికిత్స తీసుకున్న వెంటనే అతను అవుటయ్యాడు. శ్రేయా్‌సతో పాటు శశాంక్ సింగ్ (3), స్టొయినిస్ (0)లను పేసర్ ప్రసిద్ధ్ దెబ్బతీశాడు. దీంతో 110/2 నుంచి స్కోరు 118/6కి చేరడంతో పంజాబ్‌పై ఒత్తిడి పెరిగింది. కూపర్ మాత్రం ఓ 4,6తో తన ధాటిని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. యాన్సెన్ (9) త్వరగానే అవుట్ కాగా.. చివరి రెండు ఓవర్లలో 16 రన్స్ కావాల్సిన వేళ.. 19వ ఓవర్‌లో బార్ట్‌లెట్ (11 నాటౌట్) 6, కూపర్ 4తో 14 రన్స్ వచ్చాయి. దీంతో పంజాబ్ గెలుపు ఖాయమైంది.
కట్టడి చేశారు..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో మెరుపులు కరువయ్యాయి. పంజాబ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ పరుగులను అడ్డుకున్నారు. టాపార్డర్ క్రీజులో నిలదొక్కుకున్నా ధాటిగా ఆడలేకపోయింది. కనీసం ఒక్క బ్యాటర్ కూడా ఎదురుదాడికి దిగలేదు. దీంతో వీరి ఇన్నింగ్స్‌లో మొత్తంగా మూడు సిక్సర్లే నమోదు కావడం గమనార్హం. రెండో ఓవర్‌లో ఓపెనర్ గిల్ మూడు ఫోర్లతో ఆకట్టుకున్నా ఆ తర్వాత దూకుడు కనిపించలేదు. ఓపెనర్ సాయి సుదర్శన్ (13) నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. అనంతరం గిల్-బట్లర్ జోడీ దాదాపు ఆరు ఓవర్లపాటు క్రీజులో నిలిచినా రెండో వికెట్‌కు 46 పరుగులే జత చేరాయి. కుదురుకున్నట్టు కనిపించిన గిల్‌ను పదో ఓవర్‌లో చాహల్ అవుట్ చేశాడు. అయితే 12వ ఓవర్‌లో ఫిలిప్స్ 6,4తో.. తర్వాత ఓవర్‌లో బట్లర్ 6తో స్కోరులో కాస్త కదలిక కనిపించింది. కానీ ఈ జోడీ ఒక ఓవర్ వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరింది. మూడో వికెట్‌కు వీరు 36 పరుగులు జత చేశారు. డెత్ ఓవర్లలోనూ గుజరాత్ నుంచి జోరు కనిపించలేదు. 19వ ఓవర్‌లో ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోగా.. చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ నాలుగు వైడ్లు, ఓ నోబ్ పుణ్యమా అంటూ 12 రన్స్ రావడంతో స్కోరు 160 దాటింది. ఓవరాల్‌గా చివరి ఐదు ఓవర్లలో 34 పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోయింది.
స్కోరుబోర్డు
గుజరాత్: సాయిసుదర్శన్ (సి) శ్రేయాస్ (బి) యాన్సెన్ 13, గిల్ (సి) కనోలి (బి) చాహల్ 39, బట్లర్ (సి) బార్ట్‌లెట్ (బి) చాహల్ 38, ఫిలిప్స్ (సి) యాన్సెన్ (బి) వైశాక్ 25, సుందర్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 18, షారుక్ (సి) అర్ష్‌దీప్ (బి) వైశాక్ 4, తెవాటియా (నాటౌట్) 11, రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 162/6. వికెట్ల పతనం: 1-37, 2-83, 3-119, 4-129-4, 5-144, 6-150. బౌలింగ్: అర్ష్‌దీప్ 4-0-42-0, బార్ట్‌లెట్ 4-0-36-0, యాన్సెన్ 4-0-20-1, వైశాక్ 4-0-34-3, చాహల్ 4-0-28-2.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) అశోక్ (బి) రబాడ 7, ప్రభ్‌సిమ్రన్ (సి) ప్రసిద్ధ్ (బి) రషీద్ 37, కూపర్ (నాటౌట్) 72, శ్రేయాస్ (సి) సుందర్ (బి) ప్రసిద్ధ్ 18, నేహల్ (సి) గిల్ (బి) సుందర్ 3, శశాంక్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ధ్ 4, స్టొయినిస్ (సి) రషీద్ (బి) ప్రసిద్ధ్ 0, యాన్సెన్ (సి) గిల్ (బి) అశోక్ 9, బార్ట్‌లెట్ (నాటౌట్) 11, ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 19.1 ఓవర్లలో 165/7. వికెట్ల పతనం: 1-7, 2-83, 3-110, 4-113, 5-118, 6-118, 7-144. బౌలింగ్: సిరాజ్ 2-0-15-0, రబాడ 3-0-34-1, అశోక్ 3-0-31-1, రషీద్ 4-0-29-1, సుందర్ 3.1-0-27-1, ప్రసిద్ధ్ 4-0-29-3.
1
ఐపీఎల్‌లో సుదీర్ఘ ఓవర్ (11 బంతులు) వేసి సిరాజ్, తుషార్, శార్దూల్, సందీప్, హార్దిక్‌ల సరసన నిలిచిన అర్ష్‌దీప్.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత