Share News

భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:13 AM

తాగుడుకు బానిసైన ఓ కన్నతండ్రి 5వారాల పసికందును రూ.50వేలకు అమ్మేసిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.

భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం

  • తాగుడుకు బానిసైన ఓ తండ్రి దురాగతం

  • సహకరించిన ఆస్పత్రి సిబ్బంది

మైదుకూరు/చెన్నూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): తాగుడుకు బానిసైన ఓ కన్నతండ్రి 5వారాల పసికందును రూ.50వేలకు అమ్మేసిన ఘటన వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. చాపాడు మండలం సిద్ధారెడ్డిపల్లె ఎస్సీకాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మకు మైదుకూరుకు చెందిన దండు బాలకుమార్‌కు పదేళ్ల కిందట వివాహమైంది. బేల్దారి పనిచేసే బాలకుమార్‌ మద్యానికి బానిసయ్యాడు. నాలుగేళ్ల కిందట మైదుకూరులోని ఇంటిని అమ్మేశాడు. దాంతో లక్ష్మీనారాయణమ్మ.. భర్త, పిల్లలతో పుట్టింటికి చేరుకుంది. బాలకుమార్‌ తల్లిదండ్రులు జోజమ్మ, ఆరోగ్యం మైదుకూరులోనే ఉంటున్నారు. లక్ష్మీనారాయణమ్మకు ఇప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉండగా, గతనెల 24న మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండు వారాల తర్వాత ఆమె చెన్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సంక్షేమ ఆపరేషన్‌ చేయించుకుంది. ఆ సమయంలో తన బిడ్డను విక్రయిస్తానంటూ.. బాలకుమార్‌ సిద్ధడి ఆసుపత్రి వద్ద పాలు విక్రయించే మహిళతో చెప్పాడు. ఆమె ఆసుపత్రి సిబ్బందికి ఆ సమాచారం చెప్పింది. దీంతో రూ.50వేలకు బేరం కుదిర్చినట్టు సమాచారం. కు.ని. ఆపరేషన్‌ చేయించుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకం కింద ఇచ్చే నగదు గురించి మాట్లాడదామంటూ శనివారం బాలకుమార్‌ భార్య లక్ష్మీనారాయణమ్మను, తన తల్లి జోజమ్మను తీసుకొని చెన్నూరు ఆసుపత్రికి వెళ్లాడు.


అక్కడికి వెళ్లాక వారితో బాబును అమ్ముతున్నానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోకపోవడంతో అందరినీ చంపుతానని బెదిరించాడు. ఆదివారం అత్తాకోడళ్ల వద్దకు ఆసుపత్రి సిబ్బంది ఒకరు వచ్చి పసిబిడ్డను తీసుకెళ్లాడు. మూడు గంటల తర్వాత లక్ష్మీనారాయణమ్మ ఒడిలో రూ.50వేలు పడేసి వెళ్లిపోయాడు. ఆ డబ్బును బాలకుమార్‌ తీసేసుకుని వారిని ఇంటికెళ్లమని, తాను సాయంత్రం వస్తానని చెప్పాడు. జోజమ్మ కోడలిని సిద్ధారెడ్డిపల్లెకు పంపి, తాను మైదుకూరువెళ్లింది. రెండు రోజులుగా బిడ్డకు పాలు ఇవ్వకపోవడంతో లక్ష్మీనారాయణమ్మ ఏడుస్తూ మంగళవారం మైదుకూరులో ఉన్న అత్తమామల వద్దకు వచ్చింది. వారు రోదిస్తూ మాట్లాడుకుంటుండగా ఇరుగుపొరుగు వారికి విషయం తెలిసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రశాంతి వారింటికి వెళ్లి ఆరా తీశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సూపర్‌వైజర్‌ తెలిపారు. ఇంతవరకూ ఈ విషయం తమ దృష్టికి రాలేదని, విచారణ జరుపుతామని ఏఎ్‌సఐ శంకర్‌నాయక్‌ చెప్పారు.

Updated Date - Apr 01 , 2026 | 06:14 AM