తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌తో ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:38 PM
రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
హైదరాబాద్, జూన్ 08: రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేయడం ద్వారా తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర ఫర్టిలైజర్ యాప్‌ను పొరుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ నమూనాపై ప్రత్యేక యాప్‌ల రూపకల్పనకు ఇతర రాష్ట్రాలు చర్యలు చేపట్టాయని ఆయన వివరించారు. తెలంగాణ ఫర్టిలైజర్ యాప్.. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రశంసలు కూడా పొందిందని మంత్రి తుమ్మల గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా FSAS ఎరువుల యాప్ అమలుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని వివరించారు. రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా FSAS యాప్ అమలు చేస్తామన్నారు. యాప్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దీంతో ఎరువులను మీ సేవా కేంద్రాల ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. టెలిఫోన్ ద్వారా కూడా ఎరువుల బుకింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.
రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. డీలర్ల వద్ద స్టాక్ వివరాలు మొబైల్‌లోనే తెలుసుకునే విధంగా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. దీంతో ఎరువుల కోసం క్యూ లైన్‌లకు చెక్ పెడుతూ.. రైతులకు సమయానుకూల సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీలో అక్రమాలకు ఈ ఫర్టిలైజర్ యాప్ అడ్డుకట్ట వేసిందన్నారు.
ఖరీఫ్ అవసరాల కోసం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరిందని చెప్పారు. మిగిలిన యూరియా సరఫరా కోసం కేంద్రంతో నిరంతరాయంగా సమన్వయం చేసుకుంటున్నామన్నారు. అందుకోసం ఢిల్లీలో ప్రత్యేక నోడల్ అధికారిని ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు. నౌకాశ్రయాల్లోని పోర్టుల నుంచి యూరియా వేగంగా తరలింపునకు ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేశామన్నారు.
రైతుల ప్రయోజనాల కోసం ప్రతి దశను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మంత్రి తుమ్మల వివరించారు. రైతు సంక్షేమ కార్యక్రమాలపై రాజకీయాలు చేయవద్దంటూ ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హితవు పలికారు. రైతులకు మెరుగైన సేవల కోసం సాంకేతిక వినియోగాన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాలయం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల గడిచినా లభించని కల్పన ఆచూకీ..!
కేసీఆర్ మాట్లాడిన మాటలే సీఎం రేవంత్ మాట్లాడారు.. అందులో తప్పేముంది?: యెన్నం
For More TG News And Telugu News