భూ వివాదాల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:54 PM
రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో భూ భారతి, రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్19: రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో భూ భారతి, రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణంతోపాటు సేవల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.
34 నెలల్లో 12,40,366 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు వివరించారు. భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 5,68,858 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు రీ - సర్వేతో పరిష్కారమని పేర్కొన్నారు. సాగుదారులను గుర్తించి చట్టబద్ధమైన భూ హక్కుల కల్పన చేస్తున్నామని అన్నారు. నారాయణ పురంలో 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూహక్కులు కల్పించామని సోదాహరణంగా వివరించారు.
సూర్యాపేట జిల్లాలోని 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు అందించామని తెలిపారు. పాస్ పుస్తకాలతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రీ-సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.