Share News

మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్

ABN , Publish Date - Jul 31 , 2026 | 04:33 PM

తక్కువ ధర పేరుతో నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. రహదారి పక్కన, లారీల్లో విక్రయించే ఎరువులు కొనవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఎరువుల సంచిపై తయారీ, గడవు తేదీలతోపాటు ఎంఆర్‌పీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని రైతులకు విజ్ఞప్తి చేసింది.

మార్కెట్‌లో నకిలీ ఎరువులు విక్రయాలు.. రైతులకు వ్యవసాయ శాఖ బిగ్ అలర్ట్
TG Farmers

హైదరాబాద్, జులై 31: తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని రైతులు.. నకిలీ ఎరువులు కొనుగోలు చేసి.. ఇబ్బంది పడుతున్నట్లు వ్యవసాయశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ వెంటనే అప్రమత్తమైంది. దాంతో రైతులకు కీలక సూచనలు చేసింది. నకిలీ డీఏపీ ఎరువులు కొనుగోలు చేయవద్దని రైతులకు స్పష్టం చేసింది. లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు కొనాలని సూచించింది. ఎరువులు కొనుగోలు చేసిన తర్వాత.. బిల్లు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేసింది.


తక్కువ ధర పేరుతో ఎరువులు కొని మోసపోవద్దని రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ వివరించింది. రహదారి పక్కన, లారీల్లో విక్రయించే ఎరువులు కొనవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. అలాగే ఎరువుల సంచిపై తయారీ, గడవు తేదీలతోపాటు ఎంఆర్‌పీ (MRP) వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని రైతులను కోరింది. అనుమానాస్పద ఎరువుల బస్తాలను గుర్తిస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించింది. తక్కువ ధర పేరుతో మోసాలకు గురికావద్దని రైతులను హెచ్చరించింది.


జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. నకిలీ ఎరువుల తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. అప్రమత్తతే రైతుల పెట్టుబడికి రక్షణ అని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సంచాలకులు బి. గోపి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.


అయితే రాష్ట్రంలోని ఐదు జిల్లాల(రంగారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్)లో నకిలీ ఎరువుల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఎరువుల విక్రేతలపై కేసులు నమోదు చేశారు. అలాగే నిందితులను అరెస్ట్ చేశారు. వారు నిల్వ చేసిన ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకుని.. వాటిని సీజ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం.. క్రిమినల్ కేసులు నమోదు

పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..?

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 04:57 PM