Share News

పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..?

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:24 PM

అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పక్షం మాత్రం దానిని పట్టించుకోవడం లేదు. అలాంటి వేళ.. విపక్ష పార్టీకి చెందిన ఎంపీ వెరైటీ నిరసన చేపట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.

పార్లమెంట్ ప్రాంగణంలో హుండీ పెట్టిన ఎంపీలు.. రాహుల్ గాంధీ ఏం చేశారంటే..?
Rahul Gandhi Donates at Parliament Hundi Protest

న్యూఢిల్లీ, జులై 31: ఎన్డీయే సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీక్, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ ఆందోళన చేపట్టిన సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ)కి ఆయా పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో మోదీ సర్కారు దిగి రాక తప్పలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. తన పదవికి రాజీనామా చేశారు. ఇక రామమందిరంలో విరాళాల అపహరణపై సభలో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. కానీ ఎన్డీయే సర్కార్ మాత్రం వాటిని పెడచెవిన పెడుతోంది. శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.


ఆర్జేడీ పార్టీ ఎంపీ పప్పు యాదవ్.. కాషాయ వస్త్రాలు ధరించి కూర్చొన్నారు. ఆయన ముందు ఓ టేబుల్ వేసి దానిపై హుండి పెట్టారు. ఆ టేబుల్‌కు అటు ఇటు మరో రెండు హుండీలు ఏర్పాటు చేశారు. పప్పు యాదవ్ పక్కన ఓ మహిళా ఎంపీ కూడా కూర్చొని ఉన్నారు. వారికి చుట్టూ చాలా మంది రౌండ్‌గా నిలబడి ఉన్నారు. అంతలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ.. పప్పు యాదవ్ వద్దకు వచ్చి నమస్కరించి.. ఆ హుండిలో నగదు వేశారు. ఆ తర్వాత పలువురు ఎంపీలు.. ఆ హుండీలో నగదు వేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మరో వైపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026ను గురువారం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ మరుసటి రోజు.. రామ మందిరం విరాళాలు చోరీపై ఈ తాజా నిరసన చోటు చేసుకుంది. ఇంకోవైపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణాన్ని మోదీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ మందిరానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీరాముడి భక్తులు కోట్లాది రూపాయిలు విరాళాలుగా అందించారు. అయితే ఈ విరాళాలు చోరీకి గురయ్యాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఈ నేపథ్యంలో రామ మందిరం పాలక మండలిలోని పలువురు రాజీనామాలు చేశారు. అలాగే రామ మందిరంలో చేతి వాటం ప్రదర్శించిన సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మొత్తం వ్యవహారంపై యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) తో విచారణకు ఆదేశించింది. ఐజీ ఎస్ చరణ్ నేతృత్వంలోని సిట్ ఈ విరాళాల చోరీపై దర్యాప్తు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న స్కూటీ.. ఒకరి మృతి

19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు

Read Latest National News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 04:51 PM