ఎంపిక చేసిన 3 మండలాల్లో శాశ్వత కరువు నివారణ చర్యలు
ABN , Publish Date - Oct 25 , 2026 | 06:23 AM
ఎప్పుడు కరువు తలెత్తినా ప్రజలు, రైతులు నిలదొక్కునేలా రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మండలాల ఎంపిక
వ్యవసాయ శాఖ నోడల్ ఏజెన్సీగా పనులు రెవెన్యూ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడు కరువు తలెత్తినా ప్రజలు, రైతులు నిలదొక్కునేలా రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు మండలాల్లో రూ.150 కోట్లతో శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. జాతీయ విపత్తుల నిర్వహణ నిధితో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కువ కరువు తీవ్రత గల ప్రాంతాలు, అధిక వర్షాధార వ్యవసాయ జిల్లాలు, సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడిన జిల్లాల ప్రాతిపదికగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మిడ్జిల్ (మహబూబ్నగర్), ఉప్పునూతల (నాగర్ కర్నూల్), మక్తల్ (నారాయణపేట్) మండలాలను ఎంపిక చేశామన్నారు.
ఈ ప్రాజెక్టుపై వ్యవసాయ, విపత్తు నిర్వహణశాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్షించారు. విపత్తు నిర్వహణశాఖ పర్యవేక్షణలో నోడల్ ఏజెన్సీగా వ్యవసాయ శాఖ ఈ ప్రాజెక్టును అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ మండలాల్లో ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులో ప్రతి రూపాయి సద్వినియోగం కావాలన్న మంత్రి పొంగులేటి.. నిధుల వినియోగం, పనుల ఎంపిక, అమలు విధానం, క్షేత్రస్థాయి ఫలితాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు.
అన్నివర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, దాని అమలుకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో కరువు నిరోధక వ్యవసాయ విధానం అమలు, కరువు పీడిత ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషణ, ప్రతిపాదిత ప్రాజెక్టు కార్యచరణ, నిధుల వినియోగంపైనా అధికారులతో చర్చించారు. కాగా, రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల ఆకాంక్షలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి పొంగులేటి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వారంలో అనుమతులివ్వకుంటే కాలేజీలు బంద్
పనిచేయండి.. లేకుంటే తప్పుకోండి!
న్యాయవాదుల సంక్షేమానికి ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News