కేంద్రం సహకరించకపోయినా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి: సందీప్ కుమార్
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:38 PM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించకపోయినా.. ఎల్‌నినో కరవును ఎదుర్కొంటూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నామని నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 22: రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉందని.. మరింత ఉత్సాహంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలుపు సాధించాలని నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్ అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సందీప్ కుమార్ ప్రసంగించారు.
‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మనం తిప్పికొట్టాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉంది. గతంలో ఐకమత్యంగా పని చేయడం వల్ల 64 సీట్లు వచ్చాయి. జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల చేస్తున్నాము.
దేశంలో ఎల్‌నినో వల్ల తీవ్రమైన కరవు ఏర్పడింది. కరవు పరిస్థితులు అధిగమిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగినంత సహాయ సహకారాలు అందించడం లేదు. కేంద్రం సహాయ నిరాకరణ చేసినా.. కరవును ఎదుర్కొంటూ రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. మరింత ఉత్సాహంతో పని చేసి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీతో మరిన్ని అధిక స్థానాలు సంపాదించాలి.
రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు మరింత కష్టపడి పని చేయాలి. సోనియాగాంధీ రాసిన బిలాంగింగ్ పుస్తకానికి దేశంలో చాలా ప్రాధాన్యత వచ్చింది. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ గార్ల బలిదానాలు ఈ దేశంలో ప్రజల మనసులో ఉన్నాయి’ అంటూ ఇన్‌చార్జి సందీప్ కాంగ్రెస్ శ్రేణులనుద్దేశిస్తూ ప్రసంగించారు.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక