ముగిసిన పార్టీ ఇన్‌చార్జ్ ముఖాముఖి భేటీలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:19 AM
కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సందీప్‌కుమార్ ముఖాముఖి భేటీలు ముగిశాయి.
టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌తో ప్రత్యేక సమావేశం
మంత్రులు, విప్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో
సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్న సందీప్
బీజేపీ-బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం: అడ్లూరి
హైదరాబాద్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నేతలు, ప్రజా ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సందీప్‌కుమార్ ముఖాముఖి భేటీలు ముగిశాయి. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, వేముల వీరేశం, ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్ యాదవ్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, నాగరాజు, రామ్మోహన్ రెడ్డి, మనోహర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మురళీనాయక్, నాయిని రాజేందర్, నవీన్ యాదవ్ తదితరులతో ముఖాముఖి సమావేశమయ్యారు. అలాగే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌సు మళ్లీ అధికారంలోకి తేవడానికి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అలాగే టీపీసీసీ సోషల్ మీడియా విభాగం నాయకులతో సందీప్ సమావేశమయ్యారు. ఈ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపైన సమీక్ష చేశారు.
కాగా.. సందీప్‌తో భేటీ అనంతరం మీడియాతో మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడారు.. వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. సంక్రాంతి నుంచి జూన్ వరకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే ఈ కార్యాచరణ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. బీఆర్‌ఎస్, బీజేపీలు పైకి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నప్పటికీ రాజకీయంగా ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందన్నారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ఎక్కడ సభలు పెట్టినా సూపర్ సక్సెస్ అవుతుండటంతో బీఆర్‌ఎస్ నేతలు వణికిపోతున్నారన్నారు.
ఓ సీఎం వేల మంది కార్యకర్తలు, ప్రజల సమక్షంలో పాదయాత్ర చేయడం చిన్న విషయం కాదని.. గతంలో ఏ సీఎం కూడా ఇలా కా నడిచింది లేదని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రగతిభవన్, ఫాంహౌస్ తప్ప గడప దాటింది లేదని విమర్శించారు. సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు మరోమారు రాహుల్ గాంధీని అవమానిస్తే కేటీఆర్ కటౌట్లను పబ్బుల దగ్గర, కేసీఆర్ ఫొటోలను వైన్ షాపుల దగ్గర పెడతామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ హెచ్చరించారు. రాహుల్‌పై మాట్లాడే నైతిక అర్హత బీఆర్‌ఎస్ నేతలకు లేదని.. ఆయనకు తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉంది కాబట్టి వారితో కలిసి భోజనం చేశారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News