మళ్లీ కట్టు తప్పుతున్న కాంగ్రెస్..!
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:14 AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ కట్టు తప్పుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ కావడం మళ్లీ పెరిగింది.
వివాదాస్పద వ్యాఖ్యలతో.. వివాదాల్లో పార్టీ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ కట్టు తప్పుతోంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ కావడం మళ్లీ పెరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం దీక్ష చేస్తానంటూ ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఒక అస్త్రంలా వాడుకుంది. అట్లాగే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం హుజూర్‌నగర్‌కే మంత్రా.. మిగిలిని నియోజకవర్గాలకు కాదా అంటూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రేడియల్ రోడ్ల కంట్రాక్టుకు సంబంధించి ప్రభుత్వంపైనా ఆరోపణలు చేశారు. ఢిల్లీలోని ఓ హోటల్ వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ.. తనను దుర్భాషలాడారంటూ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆరోపించారు.
తాజాగా వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న గిరిజన మహిళా ప్రజాప్రతినిధిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లుగా.. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీకి హాజరు కాని ప్రభుత్వ విప్ విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్‌లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూడాలంటూ మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ లేఖ రాశారు. శ్రీధర్‌బాబుకు వంశీకృష్ణ.. వ్యంగ్యంగా రాసిన ఈ లేఖా వైరల్ అయింది. వాస్తవానికి గతంలోనూ అనిరుధ్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అనేక మార్లు పార్టీకి తలనొప్పిగా మారారు. అయితే కొద్ది నెలల కిందట మంత్రివర్గం నుంచి కొండా సురేఖను, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న సంకేతాన్ని అధిష్ఠానం ఇచ్చింది. ఈ క్రమంలో నేతలు కొంతకాలం పాటు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు. అయితే అనిరుధ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. ఈ జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఏ వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News