ఎస్‌ఏ పరీక్షల మూల్యాంకనం వేరే పాఠశాలల్లో..
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:28 AM
విద్యార్థుల అసలైన విద్యా సామర్థ్యాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు రాసే సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ) పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షల తరహాలో ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో చేయించాలని నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు అమలు..
పలు జిల్లాల్లో ఆరో తరగతి పరీక్షల్లో కూడా ఇదే విధానం
సమాధాన పత్రాల మూల్యాంకనంలో సంస్కరణలు
పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు
నేటి నుంచి ఎస్‌ఏ పరీక్షలు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అసలైన విద్యా సామర్థ్యాన్ని తెలుసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు రాసే సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ) పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని ఎస్‌ఎస్‌సీ వార్షిక పరీక్షల తరహాలో ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో చేయించాలని నిర్ణయించింది. అదే విధంగా విద్యా నైపుణ్యాల్లో వెనకబడిన రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 6వ తరగతి విద్యార్థుల ఎస్‌ఏ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని కూడా ఇతర ఉపాధ్యాయులతో చేయించనున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ బుధవారం జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా చోట్ల విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు బాగానే వస్తున్నా, చదవడం మాత్రం రావడం లేదు.
ప్రతి ఏటా పైతరగతులకు వెళ్తున్నా విద్యా నైపుణ్యాల్లో ఎలాంటి వృద్ధి కనిపించడం లేదు. విద్యాహక్కు చట్టం ప్రకారం 9వ తరగతి వరకు విద్యార్థిని ఫెయిలు చేసే అవకాశం లేకపోవడంతో.. 10వ తరగతి వచ్చే వరకు విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి ఏటా విడుదలవుతున్న సర్వే ఫలితాల్లో రాష్ట్రం అట్టడుగు స్థానాల్లో ఉంటోంది. ఈ పరిస్థితిలో పూర్తిస్థాయిలో మార్పు రావాలని విద్యా శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఎస్‌ఏ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాలను ఇతర పాఠశాలలకు చెందిన సంబంధిత ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించనుంది.
అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 6వ తరగతి ఎస్‌ఏ-1 పరీక్షల సమాధానపత్రాలనూ ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు దిద్దనున్నారు. కాగా, ఎస్‌ఏ పరీక్షల్లో మార్పుల అంశంపై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. ప్రభుత్వ నిర్ణయం వెనక కారణాలను వివరించారు. కొత్త విధానాన్ని పలు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకించారు. అయితే, ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఫలితాల ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా
Read Latest AP News And Telangana News And International News And Telugu News