ఎల్‌నినో.. దిగుబడి ఏమవునో?
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:19 AM
నైరుతి రుతుపవనాలు నిరాశపరచడం, వానాకాలం సీజన్ పూర్తికావడం, ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రానున్న రోజులు ఎలా ఉంటాయోననే బెంగ పట్టుకుంది.
వరి సాగు విస్తీర్ణం 14 శాతం తగ్గటంతో ఉపశమనం...
ఇప్పటికైతే వరి దిగుబడి తగ్గదని వ్యవసాయశాఖ అంచనా
వరి పూర్తి విస్తీర్ణంలో సాగుచేస్తే... నీరందక ఎండిపోయేది
ఎండల తీవ్రత పెరిగితే పత్తి దిగుబడి తగ్గిపోయే అవకాశం
నైరుతి తీవ్రంగా నిరాశ పర్చడంతో రైతన్నల్లో ఆందోళన
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు నిరాశపరచడం, వానాకాలం సీజన్ పూర్తికావడం, ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రానున్న రోజులు ఎలా ఉంటాయోననే బెంగ పట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయశాఖలు రూపొందించిన అంచనాల మేరకు ఖరీఫ్ దిగుబడి తగ్గే అవకాశం లేదని చెబుతున్నారుగానీ.. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగితే పంటలు ఎండిపోతాయని, దిగుబడి కొంత తగ్గుతుందని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలే.. ‘ఎల్‌నినో’ ప్రభావం వచ్చే మార్చి వరకూ ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో పంటల సాగు, దిగుబడిపై ఆందోళన నెలకొంది.
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ముందునుంచే ‘ఎల్‌నినో’ ప్రభావం పడింది. గడిచిన నాలుగు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 1-2 రోజులపాటు భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. అక్కడక్కడా అడపాదడపా వర్షాలు పడ్డాయి (ఎగువ ప్రాంతాల్లో, పొరుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాలకు వరదనీరు రావటం మాత్రం ఉపశమనాన్ని కలిగించింది). దీంతో.. వాతావరణ, వ్యవసాయ శాఖలు అప్రమత్తం చేయడంతో రైతులు ఈసారి ఆచితూచి సాగు చేశారు. సాగు నీటి భద్రత ఉన్న భూముల్లో మాత్రమే పంటలు వేశారు. వరి సాధారణ విస్తీర్ణం 66 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి ఖరీ్‌ఫలో 57 లక్షల ఎకరాల్లోనే సాగుచేశారు. నిరుడు 67 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే... ఈసారి 10 లక్షల ఎకరాల మేర విస్తీర్ణం తగ్గింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలపై నమ్మకంలేని చోట్ల రైతులు సాగుచేయకుండా భూములు వదిలేశారు.
ఉదాహరణకు... ఒక రైతుకు 10 ఎకరాల సాగుభూమి ఉంటే... అందులో 6 ఎకరాలే సాగుచేశారు. మిగిలిన 4 ఎకరాలకు నీరందించడం కష్టమని వదిలేశారు. ఎల్‌నినో తీవ్రత ఎక్కువగా ఉన్నదని, ఇకమీదట వర్షాలు పడవని రైతులు నిర్ధారణకు రావటంతో ఆగస్టు 15 నాటికే వరి నాట్లు పూర్తిగా ఆపేశారు. కొన్నిచోట్ల.. పోసిన నార్లను వదిలేశారు. ఫలితంగా వరి విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో నష్టశాతం ఆరంభంలోనే తగ్గిపోయింది. ఇక.. సాగు చేసిన వరి విషయానికి వస్తే.. ముందస్తుగా నాట్లువేసిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి కోతలు కూడా మొదలయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఇంకా రెండు, మూడు తడులకు సాగునీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో వరి గట్టెక్కుతుందనే ధీమాతో రైతులు ఉన్నారు. అయితే రోజురోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం తగ్గకపోవటం, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో చివరి తడికి ఏమైనా ఇబ్బంది ఎదురువుతుందా? అనే ఆందోళన కూడా నెలకొంది.
పత్తి, మొక్కజొన్న దిగుబడిపై ప్రభావం..
పత్తిపై ఎల్‌నినో ప్రభావం పడే ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే.. వరి విషయంలో తగ్గిన రైతులు పత్తి సాగులో ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 47.42లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 48.33లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే పత్తి రైతులు తొలకరి వర్షాలకే గింజలు విత్తినందున.. దసరా, దీపావళికి దాదాపుగా పత్తి తీయడం(పికింగ్) పూర్తయ్యే అవకాశాలున్నాయి. అయితే రైతులు ఎక్కువ రోజులు, పంటకాలం పూర్తయ్యే వరకు పత్తిమొక్కలను ఉంచే పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి, రెండు సార్లు పత్తి తీసుకొని దుక్కిదున్నే ఆలోచనతోనే ఉన్నారు. దీంతో సగటు దిగుబడి 10 క్వింటాళ్లకు బదులుగా.. 6 క్వింటాళ్ల వరకే వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండో పంట ముందుగా వేయడం ద్వారా ఈ నష్టాన్ని పూడ్చుకునే ఉద్దేశంతో రైతులున్నారు. మొక్కజొన్న విషయానికి వస్తే.. మరో 1-2 వారాల్లో ఆ పంట కూడా చేతికి రానుంది. అయితే ఈసారి తక్కువ నీటి సరఫరాతో మొక్కజొన్న కర్రలు సరిగ్గా పెరగలేదు. ఎల్‌నినో ప్రభావం పత్తితో పోలిస్తే మొక్కజొన్నపై తక్కువగా ఉన్నట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆలోగానే పంపాలని..
కర్ణాటక ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర వ్యవసాయశాఖ అధికారుల బృందం అక్టోబరు మూడో తేదీన ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత మహారాష్ట్రలో పర్యటించనుంది. కరువు పీడిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఉన్నదని స్వయంగా చౌహాన్ ప్రకటించిన నేపథ్యంలో.. వర్షపాతం తక్కువగా నమోదైన జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు కేంద్రం నుంచి వ్యవసాయ అధికారుల బృందం రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నారు. ఆలోపే సమగ్ర నివేదిక రూపొందించి, ఢిల్లీకి పంపించాలని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర బృందం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పంటల పరిస్థితిని పరిశీలించాలో నిర్ణయించుకునే అవకాశముం టుందని చెబుతున్నారు. గద్వాలలో 41 శాతం, నారాయణపేట, హనుమకొండ జిల్లాల్లో 35 శాతం, నల్లగొండలో 34 శాతం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో 32 శాతం లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో.. వీటిలో కొన్ని జిల్లాల్లో కేంద్రబృందం పర్యటిస్తుందని భావిస్తున్నారు. అయితే ఆబృందం అధ్యయనం తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందా? ఇన్‌పుట్ సబ్సిడీ ఏమైనా ఇస్తుందా? సబ్సిడీ శాతం పెంచుతుందా? వచ్చే యాసంగికి ప్రత్యామ్నాయ పంటలకు ఏమైనా ప్రోత్సాహకాలు ఇస్తుందా? అనే అంశాలపై వ్యవసాయశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లోటు వర్షపాతం
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో దెబ్బపడింది సాధారణ కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. నిర్మల్, యాదాద్రిభువనగిరి, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్లగొండ, హనుమకొండ, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ సారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇందులో 8 జిల్లాల్లో 30 శాతం నుంచి 41 శాతం వరకు లోటు ఏర్పడింది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కలిపి 740.6 మి.మీ వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా... 615.5 మి.మీ వర్షపాతమే నమోదైంది.
కేంద్రానికి నివేదిక?
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో పంటల పరిస్థితులపై నివేదిక రూపొందించి కేంద్రానికి పంపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ భావిస్తోంది. వాస్తవ సాగు విస్తీర్ణం ఎంత? ఎంత తగ్గింది? సాగుచేసిన పంటల పరిస్థితి ఏమిటి? నీటి లభ్యత ఎలా ఉంది? ఎండిపోయే పరిస్థితి ఏమైనా ఉందా? ఏయే పంటల్లో ఏ మేరకు దిగుబడి తగ్గుతుంది? అనే అంశాలపై నివేదిక తయారు చేసి కేంద్రానికి సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భావిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో, తుమ్మల ఢిల్లీ సదస్సుకు హాజరైనప్పుడూ ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణలో కరువు పీడిత ప్రాంతాలున్నాయని చౌహాన్ ఢిల్లీలో ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రధాని మోదీని ఎన్నిసార్లయినా కలుస్తా
అమెరికా, సింగపూర్‌లలో కేటీఆర్ పెట్టుబడులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News